ఖర్గే కొత్త టీమ్... సీసా పాతదే.. సారా పాతదే..!..ప్చ్
posted on Oct 27, 2022 @ 10:53AM
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చినా.. పాత సంప్రదాయం మారే పరిస్థితి లేదు. సేమ్ ఓల్డ్ టీమ్.. సేమ్ ఓల్డ్ డైనాస్టీ. కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపి పార్టీకి పునర్వైభవం తీసుకురావడమే తన లక్ష్యం అన్న ఖర్గే తన కొత్త టీమ్ లో స్థానం కల్పించిన వారి పేర్లు చూస్తే పార్టీకి పునర్వైభవం వస్తుందని అనిపించే పరిస్థితి లేదని పరిశీలకులు అంటున్నారు.
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టిన వయో వృద్ధుడు మల్లిఖార్జున్ ఖర్గే.. వెంటనే పనిలోకి దిగిపోయారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడ్బ్లూసీ స్థానంలో కొత్త స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 47 మంది సీనియర్లతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సోనియా కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ మినహా మిగిలిన అందరూ 60 ఏళ్లకు పైబడిన వారే!
వృద్ధులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసిన ఖర్గే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పార్టీ టికెట్లలో 50% యువతకే టికెట్లు ఇస్తామని ప్రకటించడం విశేషం. కాగా ఖర్గే ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీపై సామాజిక మాధ్యమం వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. ఎనిమిదిపదులు పైబడిన మల్లిఖార్జున్ ఖర్గే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పార్టీకి యువరక్తం ఎక్కిస్తానంటూ చెప్పడం..బాధ్యతలు చేపట్టిన వెంటనే సీబ్ల్యూసీ స్థానంలో47 మందితో ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా ఆరు పదులు నిండిన వారే కావడంతో ఖర్గే టీమ్ ను కొత్త సీసాలో పాత సారా అనడానికి కూడాలేకుండా పోయిందనీ, పాత సీసాలో పాత సారా చందంగా నే ఖర్గే టీమ్ ఉందని నెటిజన్లు సెటెర్లు వెస్తున్నారు.
ఖర్గే టీమ్ లో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ ,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రా మాజీ మంత్రులు ఏకే ఆంటోనీ అజయ్ మకేన్, అంబికా సోని ఆనందశర్మ , జైరాం రమేష్, పి.చిదంబరం,కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్, రాజీవ్ శుక్లా ఉన్నారు. వీరంతా ఇప్పటి వరకూ సీబ్ల్యూసీలో ఉన్న వారే. కాంగ్రరెస్ వైఫల్యాలకు బాధ్యత వహించాల్సినవారే. మళ్లీ వీరితోనూ ఖర్గే తన కొత్త టీమ్ ను ఏర్పాటు చేయడంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహంవ్యక్తమౌతోంది.
మాజీ సీబ్ల్యూసీ నేతలు, జీ-23 సభ్యులకు కూడా ఖర్గే టీమ్ లో చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాకు సంబంధించి ప్రముఖ నిర్మాత, మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డికి ఖర్గే జట్టులో స్థానం లభించింది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాకూర్ కు కూడా ఖర్గే టీమ్ లో చోటు దర్కింది. దీంతో మాణిక్కం ఠాకూర్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు మాణిక్కం ఠాకూర్ వల్ల నష్టమే జరిగిందన్న భావన కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా ఉంది. అటువంటి వ్యక్తికి ఖర్గే తన కొత్త టీమ్ లో స్థానం కల్పించడం వల్ల ఏం సాధిస్తారో అర్ధం కాదని పార్టీ వర్గాలే అంటున్నాయి.
అలాగే టీ.సుబ్బిరామిరెడ్డి కూడా.. ప్రజా బలం ఇసుమంతైనా లేని ఆయనకు తన జట్టులో స్థానం కల్పించడం వల్ల ప్రయోజనం ఏమిటన్నది ఖర్గేకే తెలియాలని అంటున్నారు. ఇలా ఎంచుకుంటూ పోతే ఖర్గే కొత్త టీమ్ వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం చేకూరదన్న భావనే కాంగ్రెస్ క్యాడర్ లో వ్యక్తం అవుతుంది.