ప్రత్యేక హోదా లేదు.. ప్యాకేజీనేనట! జగన్ రెడ్డి మౌనం వీడేనా..
posted on Mar 23, 2021 @ 2:44PM
ఆంధ్రప్రదేశ్ పై మళ్లీ పాత పాటే పాడింది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక హోదా కుదరదని మరోసారి తేల్చి చెప్పింది. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని వెల్లడించింది. ఏపీ పునర్విభజన చట్టాన్ని ఏ మేరకు అమలు చేశారో కేంద్రం స్పష్టం చేయాలని తెలుగు దేశం పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ అంశంపై తాను అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదన్నారు. రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్ ..పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పరిష్కరించుకోవాల్సినవని సమాధానమిచ్చారు.
ప్రత్యేక హోదాపై స్పందిస్తూ.. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని తెలిపారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్. 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. విభజన చట్టంలోని అనేక అంశాలు అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. మరికొన్ని విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే అంశాలని తెలిపారు. విభజన హామీల అమలుకు వివిధ శాఖలతో సమీక్ష చేస్తున్నామన్నారు. ఇరు రాష్ట్రాల అధికారులతో 24 సమీక్ష సమావేశాలు జరిగాయన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టం చేయడంతో వైసీపీ ఏం చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా నినాదంతోనే ప్రచారం చేశారు జగన్. తమకు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. కాని అధికారంలోకి వచ్చి రెండు ఏండ్లు కావస్తున్నా.. ప్రత్యేక హోదాపై మాట్లాడటం లేదు జగన్. 22 మంది ఎంపీలు ఉన్నా పార్లమెంట్ లో కనీసం మాట్లాడటం లేదు. కేంద్ర సర్కార్ కు సరెండర్ అయినందువల్లే జగన్ ప్రత్యేక హోదాపై మాట్లాడటం లేదని బీజేపీ మినహా మిగితా విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. తన కేసుల కోసం కేంద్రానికి ప్రత్యేక హోదాను జగన్ తాకట్టు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ కు ప్రత్యేక హోదాపై జగన్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే.. ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో పోరాడాలని డిమాండ్ చేస్తున్నారు. మరీ ప్రత్యేక హోదా తమ మొదటి లక్ష్యమని చెబుతూ వస్తున్న వైసీపీ.. ఇప్పుడు ఎలా పోరాడుతుందన్నది ఏపీ జనాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.