నాల్గ‌వ డెత్ వారెంట్! ఈసారైనా అమ‌లౌతుందా?

మార్చి 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష విధించాలని పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్లను జారీ చేసింది.  ఇప్పటికే మూడుసార్లు నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా పడుతూ వచ్చింది. నాలుగోసారి డెత్ వారెంట్లను పటియాలా హౌస్ కోర్టు గురువారంనాడు జారీ చేసింది.

ఎప్ప‌ట్టిలాగే గురువారంనాడు కూడా నిర్భ‌య తల్లి ఆశాదేవీ పటియాలా హౌస్ కోర్టు హాల్‌లో ఉత్కంఠ‌త‌తో తీర్పు  విన‌డం కోసం ఆతృత్ర‌తో ఎదురుచూస్తున్నారు.  

న్యాయ‌మూర్తి  త‌న తీర్పు వెల్ల‌డించారు.  మార్చి 20న ఉదయం 05.30 గంటలకు దోషులను ఉరితీయాలని ఆదేశాలు జారీ చేశారు. నలుగురు దోషులు ముకేష్ కుమార్ సింగ్, పవన్ కుమార్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ సింగ్ నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయనున్నారు.

తీర్పు అనంతరం ఆమె తరఫున వాదించిన న్యాయవాదిని కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. డెత్‌వారెంట్లు జారీ అనంతరం ఆశాదేవి మీడియా మాట్లాడారు.

'నా కూతురిపై అత్యాచారం జరిపిన నలుగురు దోషులను ఉరితీసే సమయం ద‌గ్గ‌ర ప‌డింది.  నలుగురు కామాంధులను ఉరితీసిన రోజే నా కూతురికి న్యాయం జరిగినట్టు. ఇప్పటికే మూడుసార్లు ఉరి వాయిదా పడటం విచారం. ఇక వారికున్న న్యాయపరమైన అంశాలన్నీ ఇక మూసుకుపోయాయి. దోషులు చట్టం నుంచి ఇక తప్పించుకోలేరు. ప్ర‌భుత్వం అవకాశం ఇస్తే వారి చావును చూడాలని ఉంది' అని అన్నారు.

2012 డిసెంబర్ 16న ఆరుగురు దోషులు... కదులుతున్న బస్సులో నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె బాయ్ ఫ్రెండ్‌ని దారుణంగా చిత‌క‌బాదారు. ఆ తర్వాత నిర్భయను నడిరోడ్డుపై బస్సులోంచీ విసిరేశారు. ఆమెకు ప్రత్యేక చికిత్స కోసం సింగపూర్ తరలించినా... ఆమె బతకలేదు.

ఈ కేసులోని ఆరుగురు దోషుల్లో ఒకడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి మైనర్ కావడంతో  మూడేళ్ల శిక్ష తర్వాత 2015లో విడుదలయ్యాడు. మిగతా నలుగురు ముకేష్ కుమార్ సింగ్, పవన్ కుమార్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ సింగ్ కి ఉరిశిక్ష పడింది. ఐతే చట్టంలో లొసుగులును ఉపయోగించుకొని ఉరిశిక్షను మూడుసార్లు వాయిదాపడేలా చేశారు.

దోషులకు ఉన్న న్యాయపరమైన అంశాలన్నీ మూసుకుపోవడంతో ఈసారి శిక్ష అమలు జరిగి తీరుతుందని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Teluguone gnews banner