వాస్తవాలు ఆధారాలతో బయట పెడుతున్నందునే సస్పెండ్
posted on Dec 1, 2020 @ 2:21PM
ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలనందరిని సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని సీతారం.. ఇవాళ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని సస్పెండ్ చేశారు.
ఈ నేపథ్యంలో రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. ఆ విషయాన్ని డాక్యుమెంట్ తో సహా వెల్లడించామని, వాస్తవాలు ఆధారాలతో బయట పెడుతున్నందునే తనను సభ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
ఇన్సూరెన్స్ పై టీడీపీ నిలదీసిన తర్వాత నిన్న రాత్రి హడావిడిగా ఇన్స్యూరెన్స్ ప్రీమియం జీఓ ఇచ్చారన్నారు. రైతులు నష్టపోయాక ఇప్పుడు ప్రీమియం కడితే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తికి, చనిపోయాక రూ.100 కోట్లు ప్రీమియం చేయిస్తే ఉపయోగం ఉంటుందా అని నిలదీశారు. ఇది అసెంబ్లీని, రైతులను తప్పు దోవ పట్టించడమే అని మండిపడ్డారు. దీనిపై సభా హక్కుల నోటీస్ ఇస్తామని రామానాయుడు తెలిపారు.
అరకొరగా ప్రీమియంలు కట్టడం వల్ల 2019లో ఒక్క క్లైమ్ కూడా రాలేదని చెప్పారు. టీడీపీ హయాంలో ప్రతి రైతుకు బీమా అందిందని తెలిపారు. తమపై ఎన్ని సస్పెన్షన్లను విధించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రామానాయుడు స్పష్టం చేశారు.