తెలుగు స్టేట్స్‌పై ఎన్ఐఏ పంజా.. 14 చోట్ల అటాక్స్.. ఎందుకంటే..
posted on Nov 18, 2021 @ 10:08AM
గురువారం తెల్లవారుతూనే తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఎప్పుడూ లేనిది ఏపీ, తెలంగాణపై ఏకకాలంలో ఎన్ఐఏ దాడులు చేసింది. తెల్లవారుజామున 5 గంటలకే చకచకా దిగిపోయారు ఎన్ఐఏ అధికారులు. 14 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
ఉగ్రవాదులు, టెర్రర్ అటాక్స్, బాంబ్ బ్లాస్టింగులు, మావోయిస్టులు లాంటి దేశ విద్రోహ ఘటనలను మాత్రమే డీల్ చేసే ఎన్ఐఏకు తెలుగు రాష్ట్రాల్లో ఏం పని? ఏకంగా 14 ప్రాంతాల్లో సోదాలు చేయాల్సినంత సీరియస్ మేటర్ ఏముంది? అంటూ అంతా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇంతకీ ఎన్ఐఏ దాడులకు కారణం ఏంటంటే...
ఇటీవల మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ నేత ఆర్కేపై ఓ పుస్తకాన్ని రిలీజ్ చేయబోయారు కొందరు సానుభూతిపరులు. హైదరాబాద్‌లో ఆ బుక్ ప్రింటింగ్ జరగ్గా.. పోలీసులు దాడి చేసి మొత్తం సాహిత్యాన్ని సీజ్ చేశారు. ఆ ప్రింటింగ్ ప్రెస్.. పౌరహక్కుల నాయకురాలు సంధ్య భర్తదిగా గుర్తించారు. విషయం తెలిసి ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఆర్కే జీవిత చరిత్ర గురించి పుస్తకమే ప్రింట్ చేశారంటే.. అంత ఇన్ఫర్మేషన్ వారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్కే గురించి అన్ని వివరాలు ఎవరికి తెలుసు? ఆర్కే గురించి అంత సమచారం ఉన్నవారికి.. మావోయిస్టులు, వారి కార్యకలాపాల గురించి కూడా తెలిసుంటుందిగా? వారిని ప్రశ్నిస్తే కీలక సమాచారం రాబట్టొచ్చుగా? అనే దిశగా ఎన్ఐఏ విచారణ చేపట్టింది. అందులో భాగంగా తెలంగాణ, ఏపీలోకి పలు ఇళ్లపై ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో విరసం నేత కల్యాణ్‌రావు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం అరిలోవ కాలనీలోని న్యాయవాద దంపతులు శ్రీనివాసరావు, అన్నపూర్ణ ఇళ్లలోనూ ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ నాగోల్‌లో రవిశర్మ, అనురాధ ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలు.. ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకం ప్రచురించే విషయంలోనూ ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు.