అరెస్టుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్.. జగన్ సర్కారుకు బిగ్ షాక్..
posted on May 28, 2021 @ 3:50PM
ఎంపీ రఘురామ అరెస్ట్ ఎపిసోడ్‌లో ఏపీ సర్కారుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఎదురు దెబ్బలు తగిలాయి. రఘురామ జైలు నుంచి బయటకు రావడం.. సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్‌లో చికిత్స పొందటం.. ఆయన కాళ్లకు గాయాలు ఉన్నాయంటూ మెడికల్ రిపోర్ట్ ఇవ్వడం.. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం.. ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి.. ఢిల్లీ ఎయిమ్స్‌కు ఎగిరిపోవడం.. ఇలా రఘురామ విషయంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి. తాజాగా.. జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం రఘురామ అరెస్ట్‌పై స్పందించింది.
ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన తీరు, తదనంతర పరిణామాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ రియాక్ట్ అయింది. ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శిలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కస్టడీలో రఘురామపై పోలీసుల దాడి విషయంలో అంతర్గత విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. జూన్ 7లోగా నివేదిక ఇవ్వాలని డీజీని ఆదేశించింది. రఘురామ అరెస్టు తీరుపై ఆయన తనయుడు భరత్ ఫిర్యాదు మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ విధంగా స్పందించింది.
మరోవైపు.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు గురువారం ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రఘురామకు సిటీస్కాన్, ఎమ్మారై స్కాన్‌తో పాటు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆయన పాదాల్లో సెల్ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయన రెండు కాళ్లకు వైద్యులు పీవోపీ కట్టు కట్టారు. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రఘురామకు సూచించారు. రఘురామ ఎట్టి పరిస్థితుల్లో నడవడానికి వీల్లేదని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. పరీక్షల అనంతరం ఎయిమ్స్ నుంచి అధికారిక నివాసానికి రఘురామకృష్ణరాజు వెళ్లారు.