రెండు రోజుల్లో పీఆర్సీ.. పెంపు ఎంతంటే...
posted on Mar 17, 2021 @ 4:12PM
పీఆర్సీ కోసం చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్న తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్. మరో రెండు, మూడు రోజుల్లోనే పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. ఉద్యోగుల మీద తమకెంత ప్రేమ ఉందో గత పీఆర్సీతోనే చూపించామన్నారు. మా ఉద్యోగులు కాలర్ ఎత్తుకుని ఇండియాలో తాము అత్యధిక జీతాలు పొందుతామని చెప్పుకునే విధంగా జీతాలు ఇస్తామని చెప్పాం.. దాన్ని అమలు చేస్తున్నాం.. తాను ప్రకటించిన తర్వాత ఉద్యోగులు తప్పకుండా హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. అయితే.. పీఆర్సీ పెంపు ఎంత ఉంటుందో సీఎం సభలో చెప్పలేదు. గౌరవ ప్రదమైన పీఆర్సీ ఇస్తామని మాత్రమే అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో పీఆర్సీ ఎంత ఉంటుందోననే ఆసక్తి పెరిగింది. గౌరవ ప్రదమైన పీఆర్సీ అన్నారు కాబట్టి.. ఎంతో కొంత ఇచ్చి సరిపెడతారని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అటు.. నిరుద్యోగ భృతిపైనా ఆలోచన చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. అయితే, ముందు నిరుద్యోగులు అంటే నిర్వచనం తేల్చాలన్నారు. నిరుద్యోగ భృతి విధివిధానాలు ఖరారు చేసే సమయంలో కరోనా వచ్చిందని చెప్పారు.