బ్యాటింగ్ విధ్వంసానికి కొత్త పేరు సూర్యకుమార్ యాదవ్
posted on Nov 7, 2022 6:19AM
సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ క్రికట్ లో ఇప్పుడీ పేరొక సంచలనం. వేసవి కాలం మిట్టమధ్యాహ్నం రోహిణీ కార్తెలో బయటకు వెడితే వడ దెబ్బ తగులుతుందో లేదో చెప్ప లేం కానీ.. సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లో ఉంటే మాత్రం బౌలర్లకు బౌండరీ దెబ్బలు తప్పవు. మధ్యందిన మార్తాండుడిని మించిన తీక్షణతతో సూర్యకుమార్ యాదవ్ బౌలర్లపై విరుచుకు పడతాడు.
అలాంటి బ్యాటింగ్ విధ్వంసం గతంలో డివీలియర్స్ నుంచి చూసేవాళ్లం. ఇప్పుడు డివీలియర్స్ రిటైర్ అయిపోయాడు. ఇక ఆ బ్యాటింగ్ మెరుపులు చూడలేమా? అనుకున్న వారికి సూర్యకుమార్ యాదవ్ అంతకు మించి అంటూ వచ్చేశాడు. ప్రత్యర్థి ఎవరైనా, బౌలర్ ఎంతటి వాడైనా తగ్గేదే లే అంటూ బంతిని బౌండరీకి తరలించి ఔరా అనిపిస్తున్నాడు. క్రికెట్ షాట్లకు సృజనను జోడించి క్రికెట్ బ్రెయిన్ ను అప్లై చేసి మంచి బంతిని కూడా సిక్సర్ కొట్టే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ విన్యాసాలు చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదని దిగ్గజ క్రికెటర్లు సైతం ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఆదివారం(నవంబ్6) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ నే తీసుకుంటే క్రికెటింగ్ షాట్లతో పాటు..సూర్యకుమార్ తనవైన ప్రత్యేక షాట్లతో అలరించాడు. బంతి ఏదైనా బౌండరీకి తరలాల్సిందే అన్నట్లుగా ఆడాడు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ ఆవల దాదాపు వైడ్ అన్నట్లుగా పడిన బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్రర్ కు తరలించిన షాట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బంతి ఎక్కడ వేస్తే సూర్యకుమార్ బౌండరీ కొట్టకుండా ఆపగలమో బౌలర్లకే అర్ధంకాలేదంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ ఖాతాలోకి పలు రికార్డులు వచ్చి పడ్డాయి. ఒక క్యాలెండర్ ఇయర్ లో టి20ల్లో శతకం చేసిన తొలి ఇండియన్ గా, అలాగే ఒక క్యాలండర్ ఇయర్ గా టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. తన కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకూ 39 మ్యాచ్ లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 1270 పరుగులు చేశాడు. అందులో వేయ్యీ ఆరు పరుగులు ఈ క్యాలెండర్ ఇయర్ లో చేసినవే. ఇక ప్రస్తుత టి20 ప్రపంచ కప్ లో అయితే ఇప్పటి వరకూ 225 పరుగులు సాధించి మూడో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.