ఫ్రంట్‌కే దేశం మద్దతు? బిజెపిపై బాబు గరం గరం!

 

జాతీయస్థాయిలో కమ్యూనిస్టులతో కూడిన కొత్తఫ్రంట్‌కే తెలుగుదేశం పార్టీ ఈసారి మద్దతు పలుకుతుంది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన పాదయాత్ర తరువాత పూర్తిస్థాయి కార్యాచరణలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్‌డిఎ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం ఈసారి ముందుగానే మేల్కొని తన నిర్ణయం మార్చుకుంది. అయితే బిజెపిపై దేశం పార్టీ నేతలకు కొంత సాఫ్ట్‌కార్నర్‌ ఉండేది. అదికాస్తా ఇప్పుడు పోయినట్లుంది.


ఎందుకంటే చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే మహబూబ్‌నగర్‌ జిల్లాలో బిజెపి నల్లజెండాలతో నిరసన తెలిపింది. అంతేకాకుండా బిజెపి జాతీయస్థాయి నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీ కూడా మీడియాతో మాట్లాడుతూ తాము ఎన్నో చిన్న రాష్ట్రాలు ఇచ్చాం కానీ, చంద్రబాబు సహకరించనందున తెలంగాణా ఇవ్వలేదని ప్రకటించారు. తాము అధికారం కోసం లొంగామన్న విషయాన్ని ఆయన ప్రకటించకుండా నెపమంతా తమపై నెట్టారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అందువల్ల ఫ్రంట్‌కే మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ ఎంపిలు చంద్రబాబుపై ఒత్తిడి చేసేందుకూ సిద్ధంగా ఉన్నారు.  పాదయాత్ర తరువాత దీనిపై బాబు పూర్తిస్థాయి నిర్ణయం ప్రకటిస్తారని దేశం నేతలు మీడియాకు స్పష్టం చేస్తున్నారు. ఏమైనా బిజెపి నిరసన తెలుగుదేశం పార్టీ జాతీయస్థాయి కార్యాచరణలో తుదినిర్ణయానికి దోహదపడిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Teluguone gnews banner