ఐదో తరగతి వరకు మాతృభాషలోనే
posted on Jul 30, 2020 @ 10:52AM
సంస్కృత భాష ముఖ్యభాష
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే వసూలు చేయాలి
ఎంఫిల్ కోర్సు రద్దు
ఉన్నత విద్యావిధానంలో కీలక సంస్కరణలు చేస్తూ కేంద్ర క్యాబినేట్ కొత్త విద్యావిధానం -2020 ఆమోదం తెలిపింది. అంతేకాదు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ను ఇక నుంచి కేంద్ర విద్యాశాఖగా పరిగణిస్తారు. ఈ మేరకు విద్యా వ్యవస్థలో నూతన మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇకపై ఉన్నత విద్యా సంస్థలన్నిటినీ ఒకే ఒక్క సంస్థ ఆధీనంలో ఉంటాయి.
విద్యార్థులను గుమాస్తాలుగా చేసే విద్యావిధానానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. సబ్జెక్ ల ఆధారంగానే కాకుండా విద్యార్థుల జ్ఞానాన్ని అంచనా వేసేలా పరీక్ష విధానాన్ని రూపొందిస్తూ మాతృభాషలో ఐదోతరగతి వరకు బోధన తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాచీన భాష సంస్కృతానికి పెద్దపీట వేస్తూ సంస్కృత విద్యాలయాలను విభిన్న కోర్సులు అందించే విద్యాసంస్థలుగా అభివృద్ధి చేస్తారు.
అయిదవ తరగతి వరకు మాతృ భాషలోనే విద్యాబోధన జరగాలని నిర్ణయించారు. పరీక్షలలో కేవలం సబ్జెక్ట్ ల్లో అంశాలే కాకుండా విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉండాలని తీర్మానించారు. దీంతో మూస పద్దతిలో విద్యావిధానానికి తెరపడనుంది. ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ నిర్ణయం కాస్త ఇబ్బంది కరంగానే ఉంటుంది.
ప్రస్తుతం అమలులో ఉన్న 10 ప్లస్ 2 విద్యా విధానాన్ని 5 (ప్రీ ప్రైమరీ నుంచి రెండో తరగతి)+3(మూడో తరగతి నుంచి ఐదో తరగతి)+3( ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు)+4 (తొమ్మది, పదో తరగతి, ఇంటర్ రెండు సంవత్సరాలు)గా మార్చారు.
అందుబాటులోకి వచ్చిన డిజిటల్ విధానాన్ని విద్యార్థులకు చేరువ చేసేలా నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్ ను ఏర్పాటు చేస్తారు. అంతేకాదు మొదటిదశలో ఎనిమిది ప్రాంతీయ భాషలలో ఇ-కోర్సులు రూపొందిస్తూ వర్చ్యువల్ ల్యాబ్స్ అభివృద్ధి చేస్తారు. ఉన్నత విద్యా సంస్థలు, ప్రొఫెషనల్ విద్యా సంస్థలను విభిన్న తరహా కోర్సులు అందించే విధంగా తీర్చి దిద్దుతారు. గతంలో నిరాధరణకు గురైన ఆర్ట్స్ కోర్సులకు ప్రాముఖ్యత ఇవ్వనున్నారు. ఉన్నత విద్యా సంస్థలలో లిటరేచర్, సంగీతం, తత్వ శాస్త్రం, ఆర్ట్, డాన్స్, థియేటర్, గణితం, ప్యూర్ అప్లైడ్ సైన్సెస్, సోషియాలజీ, స్పోర్ట్స్, ట్రాన్సలేషన్ విభాగాలు ఉంటాయి. ఐ ఐ టి లలో, ఇంజనీరింగ్ విద్యా సంస్థలలో ఆర్ట్స్ హ్యుమానిటీస్ కోర్సులు, హ్యుమానిటీస్ విద్యార్థులుకు సైన్స్, ఇతర వృత్తి విద్యలు నేర్చుకునే విధంగా కోర్సులను ప్రవేశ పెడతారు. పరిపూర్ణ జ్ఞానవంతులుగా విద్యార్థులను, రేపటి తరం పౌరులను అందించే లక్ష్యంతోనే ఈ విధమైన మార్పులు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ కొత్త విద్యావిధానం ద్వారా ప్రపంచంలో టాప్ 100 విదేశీ విశ్వవిద్యాలయాలు తమ బ్రాంచ్ లను మనదేశంలో నిర్వహించేందుకు వీలు కల్పిస్తారు. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. ఇకపై అన్ని కోర్సులను రెండు భాషలలో అందిస్తారు. అన్ని పాఠశాలల్లో సంస్కృత భాషను ముఖ్య భాషగా ప్రవేశ పెడతారు. సంస్కృత విద్యాలయాలు కూడా విభిన్న తరహా కోర్సులు అందించే విద్యా సంస్థలుగా మార్పు చేస్తారు.
విద్యారంగానికి పెరగనున్న బడ్జెట్
విద్యారంగంలో తీసుకువస్తున్న సంస్కరణలకు అనుగుణంగా బడ్జెట్ లోనూ కేటాయింపు పెంచనున్నారు. ప్రసుత్తం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దేశ స్థూల జాతీయ ఉత్తత్తిలో 4.43 శాతం మాత్రమే విద్యారంగానికి ఖర్చు చేస్తున్నారు. ఇక పై ఆరు శాతం నిధులను విద్యారంగానికి కేటాయిస్తారు.
కీలక మార్పులతో రూపొందించిన ఈ నూతన విద్యావిధానంలో ఇంకా అనేక మార్పులు తీసుకురానున్నారు.