ఎడారి దేశంలో వర్ష బీభత్సం
అతివృష్టి అనావృష్టి అంటూ వరుణుడి విషయంలో తరచూ అనుకుంటూ ఉంటాం. కురిస్తే కుండపోత వానలూ, లేకుండా ముఖం చాటేసే మబ్బులు. ఈ పరిస్థితి ఇండియాలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రైతాంగానికి బాగా అలవాటైన వాతావరణ పరిస్థితి. అయితే చినుకుకే మొహంవాచిపోయి ఉండే ఏడారి దేశంలో వర్షం బీభత్సం సృష్టించడం అంటే.. ఊహకు అందడం ఒకింత కష్టమే. అయితే ఇప్పుడు ఎడారి దేశాల్లో కూడా వరుణుడు వీరంగం ఆడుతున్నాడు.
ముఖ్యంగా యూఏఈలోని దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. రోడ్లు చెరువులను తలపించాయి. విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీచ్‌లు, పార్కులు మూసివేశారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన పరిణామం. మొన్నటి వరకు భారీ వర్షాలు ఇండియాను అతలాకుతలం చేశాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటాలు, పంట ధ్వంసం సంభవించాయి. ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కుండపోత వానలు కురిశాయి. చాలా చోట్ల క్లౌడ్ బరస్ట్ జరిగింది. వరదలతో రోడ్లు కొట్టుకుపోయాయి.. ఇళ్లు, పంటలు మునిగిపోయాయి. గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. ఈ ఏడాది వర్షాల వల్ల ఇండియాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇండియా వంటి దేశాలలో వానలు, వరదలు సర్వసాధారణం. కానీ అటువంటి పరిస్థితులు ఎడారి దేశాల్లో ఏర్పడటం అరుదు. అయితే ఇప్పుడు కుండపోత వానతో అబుదాబీ, దుబాయ్ లు అతలాకుతలమౌతున్నాయి.
ఎడాది దేశం యూఏఈలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో అబుదాబీ, దుబాయ్‌తో పాటు పులు నగరాల్లో జనజీవనం స్తంభించిపోయి. గంటల పాటు కురిసిన భారీ వర్షం కారణంగా రహదారులు చెరువులను తలపించాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానరాకపోకలకు తీవ్ర జాప్యం జరిగింది.
భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరద తీవ్రతను తక్కువ అంచనా వేయొద్దని, అది ఏ నిమిషంలోనైనా ప్రమాదకరంగా మారవచ్చని షార్జా సివిల్ డిఫెన్స్ అథారిటీ హెచ్చరించింది. దుబాయ్, అబుదాబీతో పాటు దోహా, ఖతార్‌లలోనూ భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేసేశాయి. యూఏఈలో భారీ వర్షాలు దాదాపు పాతికేళ్ల రికార్డును బ్రేక్ చేశాయి. వరదల నేపథ్యంలో అప్రమత్తమైన స్థానిక మున్సిపల్ సిబ్బంది.. ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అలానే ట్రావెల్ అడ్వైజరీలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.