బాబా మజాకా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు!
posted on Jun 4, 2024 @ 11:50AM
నారా చంద్రబాబు నాయుడుకి రాజకీయ చాణక్యుడిగా పేరుంది. సంక్షోభ సమయంలోనే ఆయన మరింత చురుగ్గా పని చేస్తారంటారు. అది రాష్ట్రమైనా, పార్టీ అయినా.. కష్ట కాలంలో ఉంటే.. బాబు తన మాస్టర్ మైండ్ తో గట్టెక్కిస్తారు. ఆ విషయం తెలిసి కూడా కొందరు.. తమ మీద తమకున్న అతి విశ్వాసంతో బాబుని తక్కువ అంచనా వేస్తుంటారు. అలా తక్కువ అంచనా వేసే.. తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలు అధికారాన్ని కోల్పోయాయి.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కేవలం 23 సీట్లకు పరిమితం కావడంతో.. ఇక చంద్రబాబు పని అయిపోయిందని, టీడీపీ మనుగడే కష్టమని.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావించారు. కానీ బాబు పట్టువదలని విక్రమార్కుడిగా 70 ఏళ్ళ వయసులోనూ.. తాను బలంగా నిలబడటమే కాకుండా, పార్టీని కూడా బలంగా నిలబెట్టారు. అది చాలదు అన్నట్టు.. బాబుని అక్రమ అరెస్ట్ చేసి.. జగన్ సర్కార్ తన గొయ్యి తానే తవ్వుకుంది. బాబు అరెస్ట్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఏకమయ్యారు. జగన్ ని గద్దె దించడమే లక్ష్యంగా ఎక్కడెక్కడో ఉన్న తెలుగువారంతా ఏపీకి పయనమయ్యారు. మరోవైపు జనసేన, బీజేపీ కూడా టీడీపీకి మద్దతుగా నిలిచాయి. ఇంకేముంది.. కూటమి ప్రభంజనానికి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. ఈరోజు వెలువడుతున్న ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో వైసీపీకి 20 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో బాబుని తక్కువ అంచనా వేయడమే కాకుండా, ఆయనను అరెస్ట్ చేసి.. జగన్ తన పార్టీ మనుగడని ప్రశ్నార్థం చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ చంద్రబాబు ప్రభావం గట్టిగా పని చేసింది. బాబు అక్రమ అరెస్ట్ సమయంలో.. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ నిరసనలను అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ చులకన చేసింది. ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. బాబు అరెస్ట్ తనకి చాలా ఆనందం కలిగించింది అన్నట్టుగా పరోక్షంగా ట్వీట్ చేశాడు. అది చాలదు అన్నట్టుగా "బాబు అరెస్ట్ తో తెలంగాణకి ఏం సంబంధం.. ఏపీకి వెళ్లి నిరసన చేసుకోండి" అని బీఆర్ఎస్ నేతలు నోరు జారారు. అదే బీఆర్ఎస్ పార్టీ కొంపముంచింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీ చాలాచోట్ల బలంగానే ఉంది. అలాగే, తెలంగాణ వ్యాప్తంగా బాబుకి ఎందరో అభిమానులు ఉన్నారు. ఆ విషయం బీఆర్ఎస్ నేతలకు కూడా తెలుసు. కానీ మళ్ళీ తామే అధికారంలోకి వస్తామన్న అతి విశ్వాసంతో మాటలు తూలారు. ఆ మాటలే వారిని అధికారానికి దూరమయ్యేలా చేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ని ఓడించడమే లక్ష్యంగా.. బాబు అభిమానులు, టీడీపీ శ్రేణులు పనిచేశారు. ఆ దెబ్బకి బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోవడమే కాకుండా.. ఇప్పుడు ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అనేలా పరిస్థితి తయారైంది. ఇప్పుడు తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ.. ఖాతా కూడా తెరిచే పరిస్థితి కనిపించడంలేదు.