నీట్ విచారణ జూలై 8కి వాయిదా: సుప్రీం
posted on Jun 11, 2024 @ 2:53PM
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( నీట్) టాప్ ర్యాంక్ సాధించినప్పటికీ, దేశంలోని టాప్ మెడికల్ కాలేజీ ఎయిమ్స్(ఏఐఐఎంఎస్)లో సీటు రావడం కష్టమే. ఎందుకంటే, ఈసారి టాప్ 1 ర్యాంక్ 67 మందికి వచ్చింది.
ఇది చాలా పెద్ద సంఖ్య. జూన్ 4న నీట్ ఫలితాలు విడుదలైన తర్వాతి నుంచి పరీక్ష నిర్వహణ సక్రమంగా లేదంటూ అనేక వాదనలు తెరపైకి వచ్చాయి.
వైద్య విద్యలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షే ఈ నీట్.
నీట్‌లో మొదటి ర్యాంకు సాధించిన 67 మందిలో ఆరుగురు, హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాశారు. ఎన్ని ప్రశ్నలకు, ఎన్ని మార్కులనే లెక్కలకు అంతుచిక్కని రీతిలో కొందరు విద్యార్థులు మార్కులు సాధించారు.అయితే, ఈ వాదనలను నీట్ పరీక్ష నిర్వహించే 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' ఖండించింది. పరీక్ష పేపర్ లీక్, లేదా పరీక్ష నిర్వహణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న వాదనలను తోసిపుచ్చింది. సకాలంలో పరీక్ష పేపర్ అందని కొందరు విద్యార్థులకు మాత్రమే అదనపు మార్కులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది.
కానీ, మళ్లీ పరీక్ష నిర్వహించాలంటూ కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై దేశవ్యాప్తంగా పలుచోట్ల న్యాయస్థానాల్లో కేసులు కూడా నమోదయ్యాయి.
ఎంబీబీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది మే 5న జరిగిన నీట్ ప్రవేశపరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారని.. దీనిపై సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎంట్రన్స్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకు నోటీసులు జారీ చేసింది.
అయితే ఈలోగా జరగనున్న నీట్ కౌన్సెలింగ్ పై స్టే విధించేందుకు మాత్రం నిరాకరించింది. కేసు తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.
మంగళవారం ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మీరేమీ పవిత్రమైన పనిచేయలేదు. ఇది తేలికగా కొట్టిపారేసే విషయం కాదు. పరీక్షల పవిత్రత దెబ్బతింది. దీనిపై మేం సమాధానాలు కోరుకుంటున్నాం. ఎప్పటిలోగా సమాధానం చెబుతారు? కాలేజీల రీఓపెనింగ్ జరిగిన వెంటనే చెబుతారా? లేదంటే ఈలోగా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ మొదలవుతుంది’ అని జస్టిస్ ఎన్ టీఏ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి ప్రశ్నించారు.