బీజేపీలో కాంగ్రెస్ కల్చర్! పార్టీ కంటే మోదీనే గొప్పా?
posted on Feb 25, 2021 @ 11:11AM
నెహ్రూ రింగ్ రోడ్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. ఇందిరమ్మ ఇళ్లు. నెహ్రూ జూపార్కు. మచ్చుకు హైదరాబాద్ లోని కొన్ని పేర్లు. ఇలా దేశవ్యాప్తంగా వందలు, వేలల్లో సంస్థలు, కట్టడాలు గాంధీల పేరు మీదుగానే ఉంటాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ అదే తీరు. బీజేపీ వచ్చాక ఆ గాంధీల గోల తగ్గింది. కమలం పార్టీలో వ్యక్తి స్వామ్యం ఉండదు. అంతా ప్రజాస్వామ్యమే. పార్టీ విధానమే. అలాంటిది.. మొదటిసారి ఓ నిర్మాణానికి మోదీ పేరు పెట్టడంతో అంతా ఆశ్చర్యం. బీజేపీ ప్రభుత్వం నుంచి ఇది ఊహించని పరిణామం. గుజరాత్ లోని మొతేరా స్టేడియంకు 'నరేంద్ర మోదీ స్టేడియం'గా నామకరణం చేయడం అనూహ్యం. అంతకు మంచి సంచలనం. ఇదే ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారింది.
బీజేపీలోనూ వ్యక్తి భజన మొదలైందా?
గుజరాత్ లో ప్రపంచంలోకే ఎత్తైన సర్ధార్ పటేల్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరి అభిమానం చూరగొంది బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు అదే గుజరాత్ లోని మొతేరాలో.. సర్దార్ పటేల్ పేరును కేవలం గ్రౌండ్ కే పరిమితం చేసి స్టేడియానికి నరేంద్ర మోదీ పేరు పెట్టడం ఆశ్చర్యకరం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇలా చేసేవి. పథకాలు, ప్రాజెక్టులు, నిర్మాణాలు ఏది పడితే దానికి గాంధీల పేరు పెడుతూ ఊదరగొట్టేవి. బీజేపీ ప్రభుత్వం తొలిసారి ఓ స్టేడియానికి మోదీ పేరు పెట్టడంతో కాంగ్రెస్ బాటలోనే బీజేపీ సర్కారు సైతం నడుస్తోందా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్ధార్ఱ పటేల్ ను కొంతకాలంగా బలవంతంగా తమ వాడిని చేసుకుంటోంది బీజేపీ. గాంధీలకు పోటీగా పటేల్ కు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తోంది. పటేల్ జయంతి, వర్థంతిలను ఘనంగా జరపడం.. గుజరాత్ లో అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేయడం లాంటి చర్యలతో పటేల్ ఇమేజ్ ను కమలం ఖాతాలో కలిపేసుకుంటోంది. అలాంటి బీజేపీ ప్రభుత్వం.. సడెన్ గా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన మొతేరా స్టేడియానికి పటేల్ పేరు తొలగించి నరేంద్ర మోదీ పేరు పెట్టడంతో రాజకీయ దుమారం చెలరేగుతోంది. అది కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా స్టేడియం ప్రారంభోత్సవం అయ్యే వరకూ ఈ పేరు మార్పు వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. అంత గప్ చుప్ గా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందనే దానిపైనా విమర్శలు వస్తున్నాయి.
కేంద్రం చేసిన మరోపని మరింత రాజకీయ రచ్చకు కారణమవుతోంది. స్టేడియంలో రెండు ఎండ్ లలో ఒకదానికి రిలయన్స్, మరోదానికి అదానీ పేర్లు పెట్టారు. దీనిపై రాహుల్ గాంధీ ట్విట్టర్ లో ఘాటైన కామెంట్లు చేశారు. ప్రభుత్వం ‘మేమిద్దరం - మాకిద్దరు’ అన్నట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమిత్ షా కుమారుడు జయ్ షా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘‘వాస్తవాలు అందంగా బయటపడ్డాయి. నరేంద్ర మోదీ స్టేడియం - అదానీ ఎండ్ - రిలయన్స్ ఎండ్. జయ్ షా సారథ్యం’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ‘మేమిద్దరం - మాకిద్దరు’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.
సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్‌ను కేంద్రం అవమానించిందంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ఆసక్తికర సెటైర్లు వేశారు. మోదీకి రిటైర్ కావాల్సిన సమయం దగ్గర పడిందని అందుకే మొతేరా స్టేడియంకు తన పేరు పెట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘భారతీయ జనతా పార్టీకి ఒక సంప్రదాయం ఉంది. అటల్ బిహారీ వాజిపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ‘అటల్ చౌక్’ అని పేరు పెట్టారు. కానీ ఆయన ఆ తర్వాత ప్రధాని పదవి కోల్పోయారు. ఇప్పుడు మొతేరా క్రికెట్ స్టేడియంకు నరేంద్రమోదీ పేరు పెట్టారు. దీన్ని బట్టి ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే నరేంద్రమోదీ ప్రధాని నుంచి మాజీ ప్రధాని కాబోతున్నారనేది స్పష్టం’’ అని ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ అన్నారు.
కాంగ్రెస్ విమర్శలను కమలనాథులు ఈజీగా తీసుకుంటున్నారు. మొతేరా స్టేడియానికి మోదీ పేరు పెట్టడం ఆయన దార్శనికతను గౌరవించే ప్రయత్నమని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేంద్రం తీరు, ఆ పార్టీ నేతల మాటలు చూస్తుంటే.. బీజేపీ ఇన్నేళ్లూ నమ్ముతూ, ఆచరిస్తూ వచ్చిన సిద్ధాంతాలకు దూరమవుతోందా? అనే అనుమానం కలగకమానదు. కాంగ్రెస్ లో మాదిరి కాషాయ పార్టీలో వ్యక్తి ఆరాధన మునుపెన్నడూ లేదు. సిద్ధాంతాల ఆధారంగా నడుస్తున్న పార్టీ అది. వాజ్ పాయ్, అద్వానీల కాలం నుంచీ అలానే ఉంది. మోదీ వచ్చాకే బీజేపీలో కొత్త పోకడలు పొడచూపుతున్నాయి. నో డౌట్. మోదీ స్ట్రాంగెస్ట్ లీడర్. అయితే, పార్టీ కంటే మోదీ గొప్పేం కాదు. బీజేపీ వల్లే ఆయన పీఎం అయ్యారు. ఆయన వ్యక్తి గత ఇమేజ్ పార్టీకి మరింత అడ్వాంటేజ్ అయింది. అంత మాత్రాన.. పార్టీని మించి మోదీ భజనే ఎక్కువగా చేస్తుండటం ఏమాత్రం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. గతంలో కాంగ్రెస్ సైతం ఇదే తప్పు చేసిందని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే గాంధీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో.. వారి ఇమేజ్ పడిపోగానే పార్టీ సైతం కుప్పకూలిన సందర్భాలు అనేకం. ఇప్పుడు బీజేపీ సైతం కాంగ్రెస్ దారిలోనే తప్పటడుగులు వేస్తోందని.. గాంధీల మాదిరే మోదీని ప్రమోట్ చేయడం సరైనది కాకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి మోదీకి రాజకీయంగా అంతా అనుకూలంగానే ఉన్నా.. ఎప్పుడూ ఇలానే ఉంటుందని ఏమీ లేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవడం కామన్.