తెలంగాణ, సీమాంధ్ర ప్రజలను ఆకట్టుకున్న మోడీ
posted on Aug 12, 2013 @ 11:21AM
తమకు తెలంగాణ ఎంత ముఖ్యమో... సీమాంధ్ర కూడా అంతే ముఖ్యమని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. హైదరాబాద్ లో జరిగిన నవ భారత్ యువ భేరీ సభలో మోడీ అందరినీ ఆకట్టుకొనే ప్రసంగం చేసారు. మోడీకి తెలంగాణా అంశం లేకుండా చేసామని సంబరపడుతున్న కాంగ్రెస్ పార్టీకి మోడీ పెద్ద షాక్ ఇచ్చారు.
కాంగ్రెస్ నివ్వెరపోయేలా మోడీ ‘జై తెలంగాణా ! జై సీమంద్రా!’ అని నినాదించి ప్రేక్షకులచేత కూడా నినాదింపజేసారు. రెండు ప్రాంతాలు విడిపోయినా అభివృద్ధిలో పోటీపడి గుజరాత్ ను మించిపోవాలని తానూ మనసారా కోరుకొంటున్నానని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో లక్షలాది తెలుగు ప్రజలు, గుజరాతీలు అన్నదమ్ములుగా కలిసిమెలిసి జీవించగలుగుతున్నపుడు, హైదరాబాద్ నగరంలో వేలాది గుజరాతీలు తెలుగువారితో కలిసిమెలిసి సుఖసంతోషాలతో జీవిస్తున్నపుడు, తెలుగువారు సాటి తెలుగువారితో, అదీ హైదరాబాదులో ఎందుకు కలిసి జీవించలేరని ఆయన ప్రశ్నించారు. తద్వారా అటు తెలంగాణా ప్రజలను, హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్రులను సంతోషపరచగలిగారు.