నారా లోకేశ్ చెప్పిన దొంగబ్బాయి జగనా..?
posted on Dec 11, 2015 @ 10:56AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఇప్పుడు విమర్శలు చేయడంలో జోరు పెంచారు. ఒకప్పుడు అంతగా మాట్లాడని లోకేశ్ ఇప్పుడు మాత్రం ప్రతిపక్షనేత అయిన జగన్ పై మాత్రం వ్యంగ్యాస్త్రాలు చేస్తూ జోరు పెంచాడు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగిన జన చైతన్యయాత్రలో పాల్గొన్న లోకేశ్ మాట్లాడుతూ దొంగబ్బాయి.. దొంగబ్బాయి అంటూ జగన్ పేరు చెప్పకుండానే జగన్ పై అవాకులు.. చవాకులు పేల్చారు. `మన దురదృష్టం కొద్దీ మాయమాటలు చెప్పే దొంగబ్బాయి ఇక్కడ ఉన్నాడు. అతడితో చాలా జాగ్రత్తగా ఉండాలి.. అతను చెప్పే మాటలు నమ్మొద్దు` అని ప్రజలకు లోకేష్ సూచించారు. అంతేకాదు పట్టిసీమ ప్రాజెక్టు గురించి కూడా తప్పుడు సమాచారం చేస్తున్నారని జగన్ పై మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు.. గోదావరి జలాలన్నింటినీ రాయలసీమకు తరలిస్తున్నారని అక్కడి ప్రజలకు చెప్పాడు.. మళ్లీ రాయలసీమకు వచ్చి పట్టిసీమ నుంచి ఒక్కచుక్క కూడా మనకు రాదని చెప్పాడు.. ఇవి మాయమాటలు కాదా? ` అని ప్రజలను ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ` మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరైనా రాయలసీమలో పెట్టుబడులుపెట్టేందుకు ముందుకు వచ్చారా? ఒక్క ప్రాజెక్టు అయినా రాయలసీమకు వచ్చిందా?` అని జగన్‌ను ప్రశ్నించారు. మొత్తానికి లోకేశ్ చిన్న చిన్నగా బలమైన నాయకుడిగా ఎదుగుతున్నట్టు కనిపిస్తుంది.