ఫేస్ బుక్కులో తెదేపాకు అనూహ్య ఆధరణ
posted on Dec 14, 2014 @ 10:17AM
ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో మిగిలిన పార్టీలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ ఫేస్ బుక్, ట్వీటర్ వంటి సామాజిక వెబ్ సైట్స్ ఉపయోగించుకోవడంలో ఎప్పుడూ చాలా ముందుటుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఈ సామాజిక వెబ్ సైట్స్ ని బాగా ఉపయోగించుకొని ప్రజలకు, ముఖ్యంగా యువతకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తాయి కానీ ఎన్నికల తంతు పూర్తవగానే, వాటిపై పెద్దగా ఆసక్తి చూపవు. కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, వైకాపాలు మాత్రం నేటికీ అదే దూకుడు కనబరుస్తున్నాయి. అందువలన ఈ రెండు పార్టీలకు లైక్స్ కూడా పోటాపోటీగానే సాగుతున్నాయి.
అయితే చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఈ సామాజికవెబ్ సైట్స్ ప్రభావం గురించి బాగా ఎరిగినవాడు కనుక ఆయన తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఎప్పటికప్పుడు పార్టీ మరియు ప్రభుత్వ వ్యవహారాలు, కార్యకలాపాల గురించి అప్ డేట్స్ చేస్తుంటడంతో అదే తెదేపా అధికారిక వెబ్ సైట్ అన్నట్లుగా మారింది. తెదేపా మరియు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు, కార్యకలాపాల గురించి తెలుసుకోదలచినవారు ఆయన నిర్వహిస్తున్న ఫేస్ బుక్ పేజీనే సందర్శిస్తూ తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, లైక్స్ వగైరాలు తెలియజేస్తుంటారు.
ఆయన నిర్వహిస్తున్న ఫేస్ బుక్ అకౌంట్ కి 8.73 లక్షల లైక్స్ రాగా వైకాపా అకౌంట్ కి కేవలం 4.8 లక్షల లైక్స్ మాత్రమే వచ్చాయి. భారతదేశంలో ముంబై, సూరత్, కర్ణాటక, చెన్నై, డిల్లీ తదితర నగరాలతో బాటు అమెరికా, లండన్, కువైట్, సౌదీఅరేబియా, దుబాయ్ తదితర దేశాలలో నివసించే తెలుగు ప్రజలు ఎక్కువగా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ తరపున నిర్వహిస్తున్న ఈ ఫేస్ బుక్ అకౌంట్ ని సందర్శిస్తున్న వారిలో ఉన్నారు. వారు వివిధ అంశాలపై అడిగే ప్రశ్నలకు నారా లోకేష్ నేతృత్వంలో పనిచేసే ఐటీ నిపుణుల బృందం తగిన సమాధానాలు కూడా ఇస్తుండటంతో ఆయన ఫేస్ బుక్ అకౌంట్ కి నానాటికీ ఆదరణ మరింత పెరుగుతోంది.
దేశంలో అనేక వేలమంది యువతీ యువకులు ఈ ఫేస్ బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాద్యమాలకు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకోవడం చూస్తుంటాము. కానీ అదే సామాజిక మాధ్యమాన్ని ఏవిధంగా సద్వినియోగించుకొవచ్చో, సరిగ్గా ఉపయోగించుకొంటే ఎటువంటి అద్భుతమయిన ఫలితాలు రాబట్టవచ్చో దీనివలన అర్ధమవుతోంది.