బాబు గారు.. మీరు సూపరండి!
posted on Mar 1, 2024 8:31AM
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అరకులో ఆమె బుధవారం (ఫిబ్రవరి 28) పర్యటించారు. ఆ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకొంది. అరకులో.. అరకు కాఫీ షాప్ వద్ద నారా భువనేశ్వరి కాఫీ తాగారు. ఆమె కాఫీ తాగుతున్న పోటో తీసి.. తన అధికారిక ఎక్స్ ఖాతాలో భువనేశ్వరి పోస్ట్ చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే నారా చంద్రబాబు నాయుడు ఈ ఫొటో చూసి.. తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా మన గిరిజన సోదర సోదరీమణులు ఉత్పత్తి చేసిన అరకు కాఫీ ఎలా ఉంది భువనేశ్వరీ అంటూ ప్రశ్నించారు.
ఆ వెంటనే నారా భువనేశ్వరి తన భర్త చేసిన ట్వీట్ కు తనదైన శైలిలో ఎక్స్‌లో స్పందించారు. ఈ కాఫీ బాగా నచ్చిందండి. మన వంట గదిలో ఈ అరకు కాఫీ ప్యాకెట్లు ఉన్నప్పటికీ.. అరుకు లాంటి అందమైన ప్రదేశాల్లో ఇక్కడి ప్రజల మధ్య కూర్చుని కాపీ తాగుతుంటే.. ఈ అరకు కాఫీ రుచి మరింత మధురంగా ఉందండి. ఈ కాఫీ ఇంత అద్భుతంగా ఉండడం వెనుక దాగి ఉన్న రహస్యం.. మన గిరిజన సోదర సోదరీమణులు పెంచుకున్న ప్రేమేనని ఆమె అభివర్ణించారు. అలాగే అరకు కాఫీని ప్రపంచ బ్రాండ్‌గా మార్చిన ఘనత మీదేనని.. అందుకు తాను గర్వపడుతున్నానని.. ఎక్స్ వేదికగా చంద్రబాబుకు నారా భువనేశ్వరి తెలిపారు.
ఎక్స్ వేదికగా వీరిరువురి మధ్యా చోటు చేసుకున్న సంభాషణ.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. అవుతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరకు కాఫీ బ్రాండ్ అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రవేశ పెట్టి.. ఆ కాఫీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ కాఫీ సాగు ద్వారా గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో.. వారంతా కాఫీ సాగు పట్ల ఆసక్తి కనబరిచారు. దీంతో అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఏర్పడింది.
ఈ అరకు కాఫీ రుచికి ప్రపంచంలోని కాఫీ ప్రేమికులంతా ఫిదా అయిపోయారు. అరకు రైతులు.. కెమికల్స్ ఉపయోగించకుండా.. అరకులో కాఫీ పంట సాగు చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా చేప్పాలంటే.. సేంద్రియ పద్దతుల్లో కాఫీ తోటలను పెంచుతున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని కొండ ప్రాంతాలైన అనంతగిరి, పాడేరు, పెద్ద బయలు, జి మాడుగులతోపాటు ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతాల్లో ఈ కాఫీ పంటను సాగు చేస్తున్నారు.
ఇక్కడ పండిన పంటను పలు యూరోపియన్ దేశాలతోపాటు.. పలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. అమెరికా బ్రిటన్ తదితర దేశాల్లో ఇప్పటికే అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారంటే.. అరకు కాపీ రుచిలో ఉన్న మత్తు.. గమ్మత్తు ఏంటో అర్థమవుతోంది. ఇక గతేడాది సెప్టెంబర్‌లో దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జీ 20 సదస్సు జరిగింది. ఈ సదస్సుకు విచ్చేసిన వివిధ దేశాధ్యక్షులు అరకు కాఫీ రుచి చూసి.. మనస్సు పారేసుకున్నారు. అదీ అరకు కాఫీకి ఉన్న పవర్.