Read more!

తెలుగుదేశం కోసం నందమూరి ఫ్యామిలీ

తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలిచేందుకు నందమూరి ఫ్యామిలీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. నందమూరి కుటుంబం నుంచి నుంచి నందమూరి రామకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినితోపాటు నందమూరి చైతన్య కృష్ణ.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచార రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతోంది. అయితే నందమూరి ఫ్యామిలీ ఇలా ఎంట్రీ ఇవ్వడం ద్వారా పార్టీకి అదనపు బలం చేకూర్చినట్లు అవుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితేనేమీ... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితేనేమీ తెలుగుదేశం  అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ అభ్యర్థులకు టీడీపీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురై... చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా వైసీపీ విజయం సాధించగలిగామని వైసీపీలోనే చర్చ జోరుగా సాగుతోంది.   ఈ మొత్తం ఎపిసోడ్‌లో జగన్ ప్రభుత్వంపై గ్రాడ్యుయేట్లలోనే కాదు.. వైసీపీలోని  ఎమ్మెల్యేల్లో సైతం తీవ్ర వ్యతిరేకత ఉందని క్లియర్ కట్‌గా స్పష్టమైందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 

 మరో వైపు  జగన్ ప్రభుత్వ వ్యవహార శైలిపై ఓ వైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు తదితర కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్తుండగా.. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ.. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్  తీరును జనం మధ్యే ఎండగడుతోన్నారు. 

అదీకాక.. ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాది ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సమయంలోనే నందమూరి ఫ్యామిలీ  రంగంలోకి దిగి.. జగన్ గద్దెనెక్కిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకొన్న వరుస పరిణామాలను.. ప్రజల మధ్యకు వెళ్లి వివరించడం.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు.. తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు.. అలాగే వైయస్ జగన్ గద్దెనెక్కిన తర్వాత జరిగిన అభివృద్ధి పనులను బేరీజు వేసి  వివరించగలిగితే.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అలాగే నందమూరి కుటుంబ సభ్యులు కూడా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాకుండా.. రాష్ట్రంలోని ఓ బలమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని.. ఇంకా వివరంగా చెప్పాలంటే.. గుడివాడ, గన్నవరం లాంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా నిలబడితే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కాదు తెలుగుదేశం పార్టీకి వైనాట్ 175 అనుకునే పరిస్థితి వస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. 

మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని నందమూరి తారకరత్న స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకు వెళ్లే క్రమంలో నందమూరి ఫ్యామిలీ రంగంలోకి దిగాల్సిన అవశ్యకత మాత్రం  ఉందనే ఓ అభిప్రాయం పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోంది.