అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీ చిత్రాలు
posted on Jun 10, 2013 @ 3:36PM
ఒకప్పుడు జగపతిబాబు, శ్రీకాంత్ వంటి హీరోలు కుటుంబకథా చిత్రాలు చాలా చేసి ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించేవారు. అప్పుడంటే జనాలు అలా ఉండేవారు కాబట్టి ఏం తీసిన చూసేవారు కానీ ఇప్పుడంటే అల కాదు కదా? అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.... ప్రస్తుతం లవ్, యాక్షన్, మాస్ మసాలా సినిమాలు తప్ప ఏమి కనిపించడం లేదు. దీంతో కుటుంబంతో కలిసి చూసే సినిమా అని ఏ చిత్రం కూడా అనిపించుకోవట్లేదు.
అయితే ఎలాగైనా కుటుంబ కథ చిత్రాలు తీసి ప్రేక్షకులను మళ్ళీ థియేటర్లకు రప్పించాలని... వాళ్ళ కుటుంబ సభ్యులతోనే చిత్రాలు తీసేస్తున్నారు. మరి వాళ్ళెవరో ఒకసారి చూద్దామా.
తెలుగు సినిమా ముడు తరాల హీరోలు ఒకే చిత్రంలో కనిపించడానికి సిద్దమయ్యారు. అక్కినేని వంశం నుండి నాగేశ్వర్ రావు, నాగార్జున, నాగచైతన్యలు కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి మనం అనే టైటిల్ ఖరారు చేసారు. ఇష్క్ చిత్రం తర్వాత విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
అదే విధంగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు, నిర్మాత డా. మంచు మోహన్ బాబు తన కొడుకులు విష్ణు, మనోజ్ లతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ విదేశాలలో జరుపుకుంటుంది.
ఎన్నో చిత్రాలను తన సంస్థలో నిర్మించిన నటుడు, నిర్మాత డా. రామానాయుడు... తన తదుపరి చిత్రాన్ని తన కుటుంబం లోని హీరోలతో చేయనున్నారు. ఈ చిత్రంలో రామానాయుడు, సురేష్ బాబు, వెంకటేష్, రానా, నాగచైతన్యలు నటిస్తున్నారు.
మరి వీళ్ళ కుటుంబాలతో అయినా త్వరలో కుటుంబ కథా చిత్రాలు వస్తాయో లేదో చూడాలి.