నాగబాబు ఆస్తులు, అప్పుల చిట్టా ఇదే..!
posted on Mar 10, 2025 @ 11:34AM
మెగా బ్రదర్, జనసేన సీనియర్ నాయకుడు నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన గెలుపు లాంఛనమే. అయితే తన నామినేషన్ దాఖలు సందర్భంగా ఆయన అఫిడవిట్ లో వెల్లడించిన ఆస్తుల వివరాలు ఆసక్తిగా ఉన్నాయి. ఆయన ఆస్తులు, అప్పుల చిట్టా ఇలా ఉంది.
నాగబాబు తన సోదరులిద్దరి నుంచీ అప్పు తీసుకున్నారు. తన పెద్ద సోదరుడు, మెగా స్టార్ చిరంజీవి నుంచి నాగబాబు 28 లక్షల 48 వేల 871 రూపాయలు అప్పు తీసుకున్నారు. అలాగే తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి ఆరు లక్షల 90 వేల రూపాయలు అప్పుతీసుకున్నారు. తన అఫిడవిట్ లో పేర్కొన్న ప్రకారం ఏ పోలీసు స్టేషన్ లోనూ నాగబాబుపై కేసులు లేవు.
సరే సోదరుల వద్ద చేసిన అప్పు కాకుండా, తన పేరుపై రెండు బ్యాంకులలో హోంలో మొత్తం 56 లక్షల 97 వేల రూపాయలు, కార్ లోన్ 7 లక్షల 54 వేల 895 రూపాయలు ఉందని అఫడివిట్ లో పేర్కొన్నారు. ఇవి కాకుండా కొంత మంది వ్యక్తులు, సంస్థల నుంచి తీసుకున్న రుణం 1.64 కోట్ల రూపాయలు ఉంది.
ఇవి కాకుండా తన పేరుమీద 59 కోట్ల రూపాయల చరాస్తులు, 11 కోట్ల రూపాయల స్థిరాస్థులు ఉన్నాయి. చరాస్తులలో 55.37 కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్, బాండ్ల రూపంలోనూ, 21.81 కోట్లు నగదు రూపంలోనూ ఉండగా, 23.53 లక్షల రూపాయలు బ్యాంకులోనూ ఉన్నాయని నాగబాబు తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. 1.3 కోట్ల రూపాయలు తాను ఇతరులకు ఇచ్చిన అప్పు ఉందనీ, అలాగే 67.28 లక్షల విలువ చేసే బెంజ్ కారు ఒకటి, 11.04 లక్షల రూపాయలు విలువ చేసే హుండాయి కారు ఒకటి ఉన్నట్లు నగబాబు ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు.
నాగబాబు ఎన్నికల అఫిడవిట్ మేరకు ఆయన వద్ద 18.10 లక్షల రూపాయలు వివుల చేసే 226 గ్రాముల బంగారం ఉండగా, ఆయన భార్య వద్ద 16.50 లక్షల రూపాయల విలువ చేసే 55 క్యారెట్ డైమండ్లు ఉన్నాయి. అలాగే 57,99 లక్షల రూపాయలు విలువ చేసే 724 గ్రామల బంగారం, 21.40 లక్షలు వివుల చేసే 20 కేజీల వెండి ఉన్నాయి.