హైడ్రా చర్యలు చట్ట విరుద్ధం... నాగార్జున!
posted on Aug 24, 2024 @ 2:19PM
హైదరాబాద్ మాదాపూర్‌లోని ‘ఎన్’ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత కార్యక్రమాన్ని ‘హైడ్రా’ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్ కన్వెన్షన్ అధినేత, సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. హైడ్రా చట్టవిరుద్ధంగా వ్యవహరించిందంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని ఆ పోస్టులో పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాను ఎలాంటి చర్యలూ చేపట్టలేదని, కొన్ని వాస్తవాలను తెలిపేందుకు ఈ ప్రకటన చేసినట్లు వెల్లడించారు.
"ఎన్ కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. నూటికి నూరుశాతం ప్రైవేట్ స్థలంలో నిర్మించిన కట్టడాలవి. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసుపై కోర్టు స్టే మంజూరు చేసింది. ఈ కూల్చివేత తప్పుడు సమాచారంతో, చట్ట విరుద్ధంగా జరిగింది. ఈ కూల్చివేతలకు సంబంధించి మాకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిని. కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, ఆ కూల్చివేతను నేనే నిర్వహించేవాడిని. తాజా పరిణామాల వల్ల, మేం ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను" అని నాగార్జున పేర్కొన్నారు.