ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేయాలట
posted on Apr 13, 2015 @ 11:25AM
దేశంలో ముస్లింలకు ఉన్న ఓటు హక్కును రద్దు చేయాలని శివసేన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ముస్లింల ఓటు హక్కు రద్దు చేయాలని శివసేన అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో ప్రభుత్వాన్ని కోరింది. ముస్లింలు తరుచుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు గురవుతున్నారని పేర్కొంది. ఎఐఎంఐఎం పార్టీ నేతలు విషపు పాముల లాంటి వారని విమర్శించింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేదని సామ్నాలో తెలిపింది. అయితే శివసేన చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దుమారం రేగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ శివసేన పై విరుచుకుపడ్డాయి. ఇలాంటి వ్యాఖ్యల వల్ల మతస్థుల మధ్య విభేదాలు వస్తాయని సమాజ్ వాదీ పార్టీ ఆరోపించింది. ప్రజలలో ఆవేశాలను రగిలించి సమాజాన్ని చీల్చడానికే శివసేన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని.. శివసేన చేసిన వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.