హిందూ కరోనా మృతులకు అంత్యక్రియలు.. ముస్లిం యువకులకు సెల్యూట్
posted on Apr 28, 2021 @ 2:59PM
కరోనా మహమ్మారి ప్రజలను బలి తీసుకుంటోంది. ప్రాణాలు తీయడమే కాదు మానవ సంబంధాలను తెంచేస్తోంది. సొంతవారే మానవత్వం లేకుండా ప్రవర్తించేలా చేస్తోంది. కరోనా సోకితే.. కుటుంబ సభ్యులే దగ్గరికి రాని పరిస్థితి. కరోనాతో చనిపోతే అంత్యక్రియలకు కూడా ముందుకు రావడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేమున్నామంటూ ముందుకొచ్చి వారి అంత్యక్రియలను పూర్తి చేస్తున్నారు నలుగురు యువకులు. ముస్లింలు అయినా.. కరోనాతో మృతి చెందిన హిందువులకు సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకుంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నలుగురు ముస్లిం సోదరులు చేస్తున్న పనికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఒంటరిగా ఉంటున్నారు. ఇటీవల ఆయనకు కరోనా రావడంతో నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో కొద్ది రోజులు చికిత్స పొంది ఎవరికీ చెప్పకుండా వచ్చేశాడు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అమ్రాబాద్ నుంచి తిరుమలాపురం వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో అక్కడే ఓ పాత ఇంటి ముందు పడుకున్న అతను నిద్రలోనే మృతి చెందాడు. గుర్తించిన స్థానికులు పోలీసులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో అమ్రాబాద్ కు చెందిన నలుగురు ముస్లింల యువకులు ముందుకొచ్చి వైద్య అధికారి నాగరాజు ఇచ్చిన పిపిఈ కిట్లను ధరించి మృతదేహాన్ని ట్రాక్టర్ ద్వారా తిరుమలాపురం గ్రామానికి తరలించి ఖననం చేశారు. అంత్యక్రియల్లో ముస్లిం యువకులకు గ్రామ సర్పంచ్ శారద. ఎస్ఐ వెంకటయ్య సహకారం అందించారు.
అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి లోను కరోనాతో ఇద్దరు మృతి చెందగా అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో సర్పంచ్ ఆధ్వర్యంలో పిపిఈ కిట్లను ధరించి పంచాయతీ టాక్టర్లు ద్వారా మృతదేహాలను తరలించి శ్మశాన వాటిక వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. మండల పరిధిలోని ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే ముస్లిం యువకులు అక్కడికి చేరుకుని వారి సాంప్రదాయ ప్రకారమే కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. వీరి సేవ పట్ల అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అభినందిస్తున్నారు. జనాలు దండం పెడుతున్నారు.