పాపం.. నగలు చేయించమంది... అంతే...

 

భర్తని భార్య నగలు చేయించమని అడగటం మామూలే. భార్య నగలు చేయించమని అడిగితే ఏ భర్తయినా చేయిస్తాడు.. లేకపోతే తర్వాత చూద్దాం అని దాటవేస్తాడు. అయితే ఓ భర్త మాత్రం నగలు చేయించమని అడిగిన తన భార్యని చంపేశాడు. అంతేకాకుండా దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చివరికి దొరికిపోయాడు. కర్నాటకలోని హిరేహళ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మల్లన్న అనే వ్యక్తి కొద్ది సంవత్సరాల క్రితం ఒక మహిళను పెళ్ళాడాడు. మల్లన్న శాడిజాన్ని భరించలేక ఆ మహిళ విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత నాగవేణి అనే మహిళని రెండోపెళ్ళి చేసుకున్నాడు. కొన్నాళ్ళు సంసారం బాగానే నడిచింది. మల్లన్న ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 ఎకరాల భూస్వామి. తన పొలంలో పత్తి పండించాడు. దిగుబడి బాగా రావడంతో మల్లన్నకి డబ్బు బాగా మిగిలింది. తన భర్త బోలెడంత సంపాదించాడని సంతోషించిన ఆయన భార్య తనకు నగలు చేయించాల్సిందిగా భర్తను అడిగింది. ఇక్కడే వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. మాటామాటా పెరిగి మల్లన్న తన భార్య నెత్తిన కర్రతో కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ నేరం తనమీద పడకుండా వుండాలన్న ప్లాన్‌తో మల్లన్న ఆమె శరీరం మీద కిరోసిన్ పోసి అంటించాడు. ఆత్మహత్య చేసుకుందని గ్రామంలో అందరికీ చెప్పాడు. అయితే పోలీసులు అనుమానంతో ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది.

Teluguone gnews banner