అత్యాచార౦ చేస్తే ఉరితీస్తారా?.. ములాయం ప్రశ్న
posted on Apr 11, 2014 @ 10:07AM
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అత్యాచార నిరోధక చట్టాన్ని వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారానికి పాల్పడితే ఉరి వేస్తారా? అని ప్రశ్నించారు. 'వాళ్లు పిల్లలు. పిల్లలన్నాక తప్పులు చేస్తారు. దానికే ఉరి శిక్ష వేయాలా?' అని నేరస్థులకు మద్దతు తెలిపారు. ఇద్దరు ప్రేమికుల మధ్య విభేదాలు రాగానే, అబ్బాయి తనను రేప్ చేశాడంటూ అమ్మాయి ఫిర్యాదు చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. అత్యాచారం పేరిట తప్పుడు కేసులు పెట్టే మహిళలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీలో గ్యాంగ్ రేప్ అనంతరం కేంద్రం తెచ్చిన ‘నిర్భయ’ చట్టాన్ని తాము సవరిస్తామని ఎన్నికల సభలో హామీ ఇవ్వడం ఆశ్చర్యకరంగా వుంది.
అయితే ములాయం చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ములాయం ఆ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఈ వ్యాఖ్యలు మహిళలకే కాదు.. సమాజానికే వ్యతిరేకమని అన్నారు. ములాయం సింగ్ యాదవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.