ములాయం వ్యాఖ్యలపై నిర్భయ పేరెంట్స్ ఆగ్రహం
posted on Apr 11, 2014 @ 3:23PM
రేప్ చేసిన వారికి ఉరిశిక్ష విధించడం దారుణమని, రేప్ లాంటి పొరపాట్లు జరుగుతూ వుంటాయని, వాటికి మరణశిక్ష విధించడం అన్యాయమని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ములాయం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని నిర్భయ తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పట్ల వారు తీవ్రంగా స్పందించారు. కూతుర్ని పోగొట్టుకున్నవారికి, కూతుళ్ళు అత్యాచారాలకి గురైన వారికి ఆ బాధ తెలుస్తుందని వారు అన్నారు. అత్యాచారం అనేది మగవాళ్ళు చేసే తప్పు కాదని.. అది దారుణమైన నేరమని వారు అన్నరు. తనను తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పుకుంటున్న ములాయం సింగ్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం విచారకరమని అన్నారు. ములాయంసింగ్ లాంటి నాయకుల వల్లే దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని అన్నారు. ములాయం లాంటి నాయకులు అధికారంలోకి రాకుండా ప్రజలు జాగ్రత్తగా వుండాలని వారు కోరారు.