జగన్‌కో న్యాయం.. పవన్‌కో న్యాయమా ముద్రగడా?
posted on Mar 11, 2024 @ 10:00AM
ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యవహారశైలి పలు అనుమానాలకు తావునిస్తోంది. కాపు సామాజికవర్గానికి రిజర్వేషన్లు, సామాజికవర్గ ప్రజల అభ్యున్నతే తన ధ్యేయం అని చెప్పుకుంటూ ఇన్నాళ్లూ పబ్బంగడుపుకున్న ముద్రగడ.. ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కాదు.. కాదు.. ఇన్నాళ్లూ కాపు నేత ముసుగులో జగన్ ప్రణాళికను అమలు చేసిన ముద్రగడ.. పవన్ దెబ్బకు అవి బెడిసికొట్టడంతో ముసుగు తీసేసి.. తన నిజస్వరూపాన్ని చూపించడానికి రెడీ అయ్యారనడం కరెక్ట్. ముద్రగడ ఇన్నాళ్లు ఆడిన రాజకీయ నాటకాన్ని గుర్తించిన కాపు సామాజిక వర్గ ఓటర్లు ఇప్పుడు మద్రగడపై మండిపడుతున్నారు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అయితే.. ముద్రడ కాపు సామాజిక వర్గానికి చేసిన మోసంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.. సిగ్గుందా నీకు అంటూ నిలదీశారు. గతంలో ముద్రగడకు కాపు సామాజిక వర్గ ప్రజల అండదండలు పుష్కలంగా ఉండేవి.. ముద్రగడను ఏమైనా అంటే ఆ సామాజికవర్గం ఊరుకునేది కాదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ముద్రగడ సీఎం జగన్ మునిషి అని గుర్తించిన నాటి నుంచి కాపు సామాజిక వర్గం ఆయన పేరెత్తితే మండిపడుతున్నారు. దీంతో కేఏ పాల్ ముద్రగడపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా.. కనీసం ఖండన ఇచ్చేందుకు కూడా కాపు సామాజిక వర్గం నుంచి ఎవరూ ముందుకురాలేదు.
కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్నానని చెప్పుకుంటూవచ్చిన ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం హయాంలో ఆందోళనలు నిర్వహించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం కాపు రిజర్వేషన్లు అంటూ తెగ హడావుడి చేసిన ముద్రగడ, జగన్ సీఎం అయిన తరువాత కాపు రిజర్వేషన్ల ముచ్చటే ఎత్తలేదు. దీనికి తోడు గత ఎన్నికల సమయంలో కాపు రిజర్వేషన్లుకు నేను వ్యతిరేకం అని జగన్ మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన తరువాత కూడా ఆయనను గెలిపించేందుకు ముద్రగడ ప్రయత్నం చేశారనే విమర్శలుసైతం ఉన్నాయి. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ముద్రగడ సైలెంట్ అయిపోయారు.. కాపు రిజర్వేషన్లు లేవు.. కాపు ఉద్యమం లేదు.. కేవలం చంద్రబాబును గద్దెదించేందుకే కాపులను అడ్డుపెట్టుకొని ముద్రగడ నాటకం ఆడారనే విషయాన్ని కాపు సామాజిక వర్గం ప్రజలకు బోధపడింది. అందుకే ముద్రగడకు కాపు సామాజిక వర్గం ప్రజానీకం బైబై చెప్పి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కే మద్దతు అని చెబుతున్నారు.
ముద్రగడ పద్మనాభంకు జనసేన పార్టీ అన్నా, పవన్ కల్యాణ్ అన్నా.. మొదటి నుంచి చిన్నచూపే. కాపు సామాజిక వర్గం పెద్దగా తాను తప్ప మరెవరూ ఉండకూడదు. కాపులంతా తన మాటే వినాలి.. తాను ఏ పార్టీకి ఓట్లేయాలి అంటే కాపులంతా గుండుగుత్తగా ఆ పార్టీకే ఓట్లు వేయాలన్నది ముద్రగడ ఉద్దేశంగా చెబుతున్నారు. ఆ మేరకు కాపు సామాజిక వర్గ ప్రజానీకాన్ని తనవైపుకు తిప్పుకోవడంలో ముద్రగడ ఇన్నాళ్లు సక్సెస్ అయ్యారు. కానీ, పవన్ రాజకీయాల్లోకి రావడంతో ముద్రగడ ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం మెజారిటీ కాపు సామాజిక వర్గం పవన్ వైపే ఉన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తెలుగుదేశం, బీజేపీ కూటమితో కలసి ఎన్నికలకు వెళ్తున్నారు. అయితే ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరకుండానే ఇంత కాలం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు నిబంధనలుపెడుతూ వచ్చారు. తెలుగుదేశంతో పొత్తులో భాగంగా పవన్ తక్కువ సీట్లు తీసుకున్నారంటూ జనసైనికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కనీసం 50 నుంచి 70 సీట్లు అడగాలంటూ పవన్ కు సూచనలు చేశారు. జనసేన తన కనుసన్నల్లోనే నడవాలన్నట్లుగా ముద్రగడ లేఖలతో తెగహడావుడి చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కావడంతో పవన్ కల్యాణ్ సైతం ఆయన్ను గౌరవిస్తూనే వచ్చారు.
గత నెలలో ముద్రగడ జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. జనసేనకు సంబంధించిన నేతలు సైతం ముద్రగడతో భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ సైతం ముద్రగడ సీనియర్ నేత కావడంతో ఆయన నివాసానికి వెళ్లి కలిసి పార్టీలోకి ఆహ్వానించాలని భావించారు. అయితే ముందు షెడ్యూల్ చేసిన ప్రోగ్రాంల కారణంగా పవన్ ముద్రగడ నివాసానికి వెళ్లలేపోయారు. పవన్ తనకు ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించలేదని భావించిన ముద్రగడ.. వైసీపీలోకి చేరేందుకు నిర్ణయించుకున్నారు. మరి జగన్ మోహన్ రెడ్డికూడా ముద్రగడ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించలేదు. కాపుల అభ్యున్నతికి ఎలాంటి హామీలూ ఇవ్వలేదు. కానీ ముద్రగడ కేవలం వైసీపీ విజయం కోసం మాత్రమే పనిచేస్తానంటూ వైసీపీలోకి వెళ్తున్నారు. సొంత సామాజిక వర్గానికి చెందిన, ఓ పార్టీకి అధినేత అయిన పవన్ కల్యాణ్ మాత్రం ముద్రగడను ఇంటి కొచ్చి కలవాలి.. జగన్ అయితే.. ముద్రగడే తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేయాలి. దీంతో పవన్ అయితే ఓ న్యాయం.. జగన్ అయితే ఓ న్యాయమా ముద్రగడా అంటూ కాపు సామాజిక వర్గం ప్రశ్నిస్తున్నది. కాపునేతలపై మీ కపట ప్రేమ తేటతెల్లం అయిందని కాపు సామాజిక వర్గం ఇప్పుడు ముద్రగడపై మండిపడుతోంది.