ముద్రగడ పద్మనాభరెడ్డికి ఘోర అవమానం!
posted on Jun 21, 2024 @ 10:31AM
ముద్రగడ పద్మనాభం జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది. ఇప్పుడు కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ‘కాపు’ నాయకుడిగా సుదీర్ఘకాలం రాష్ట్ర రాజకీయాలలో రచ్చ చేసిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ‘ముద్రగడ పద్మనాభరెడ్డి’గా మారిపోయారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిస్తే తాను తన పేరుకు ‘రెడ్డి’ తగిలించుకుంటానని శపథం చేసిన ముద్రగడ తన శపథాన్ని నెరవేర్చారు. ప్రభుత్వ గజిట్‌లో తన పేరు మార్చుకున్నారు. దాంతో గంగ, చంద్రముఖిగా మారినట్టు కాపు నాయకుడు కాస్తా ‘రెడ్డి’గా మారిపోయారు.. తన సామాజికవర్గానికి పూర్తిగా దూరమైపోయారు. కాపులు, రెడ్లు వేరు కాదని, ఇద్దరూ ఒకటేనని చరిత్ర చెబుతున్నప్పటికీ, ఇప్పుడున్న సమాజంలో కాపులు, రెడ్లు మేం వేరు వేరు.., డిఫరెంట్.. డిఫరెంట్ అనుకుంటూ వుంటారు. చరిత్రని పరిశీలిస్తే ఈ రెండు సామాజికవర్గాలూ ఒకటేనని అర్థమవుతుంది. సాధారణంగా రెడ్డి కులస్తుల క్యాస్ట్ సర్టిఫికెట్లో ‘కాపు’ అనే వుంటుంది తప్ప ‘రెడ్డి’ అని వుండదు. అయినప్పటికీ, ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి కాపు కాదు.. పక్కా రెడ్డి. ఇకపై ఆయన కాపు రాజకీయాల్లో తల దూర్చడానికి వీల్లేదు. నేను కాపుల ప్రతినిధిని, కాపుల నాయకుడిని అని చెప్పుకోవడానికి వీల్లేదు.
ఇంతకాలం కాపుల కోసం పోరాడుతున్నా అని రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చిన ముద్రగడకి, పేరు మార్చుకున్న సందర్భంగా ఘోర అవమానం జరిగింది. ఏ ఒక్క కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయినా, ‘‘సార్.. మీరు పేరు మార్చుకోవద్దు.. మాకోసం చాలా చేశారు... మీరు మా నుంచి దూరం కావడం ఇష్టం లేదు... మీరు మాతోనే వుండాలి’’ అని అన్న దాఖలాలు వున్నాయా.. లేవు! పేరు మార్చుకుంటావో.. ఊరు మార్చుకుంటావో మాకెందుకంట అన్నట్టు సైలెంట్‌గా వుండిపోయారు. పోనీ, అలా రాకపోతే రాకపోయారు.. మరోసారి కాపుల వ్యవహారాల్లో తల దూరిస్తే తాట తీస్తాం అని వార్నింగ్ కూడా కాపు నాయకులు ఇచ్చారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా కాపు నాయకుడిగా చెలామణీ అయిన ముద్రగడకి ఇంతకంటే అవమానం మరొకటి వుంటుందా?
పవన్ కళ్యాణ్‌కి పద్మనాభరెడ్డి విషయంలో కాస్త సానుభూతి వుండేదట. ఏదో పెద్దమనిషి ఆవేశంగా పేరు మార్చుకుంటానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అంత అవసరం లేదు.. ఆయన దగ్గరకి వెళ్ళి బుజ్జగించి, పేరు మార్చుకోకుండా చేయాలని అనుకున్నారట. ముద్రగడ కుమార్తెతో కూడా ఈ మేరకు సంప్రదింపులు కూడా జరిపారట. అయితే ముద్రగడ మాత్రం నా శపథం చాణక్య శపథం.. నా శపథం మంగమ్మ శపథం కంటే మూడు రెట్లు ఎక్కువ అన్నట్టు బిల్డప్పు ఇచ్చారట. ఇక ఈ మనిషిని బతిమాలి వేస్టు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఇంటికి వెళ్ళే ఉద్దేశాన్ని విరమించుకున్నారట. ముద్రగడని బుజ్జగించే ఉద్దేశంతో ఆయన ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్తే, అప్పుడాయన నేను మారనంటే మారనని బెట్టు చేస్తే అనవసరంగా తన టైమ్ వేస్ట్ అవుతుందన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఊరుకున్నట్టు సమాచారం. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంతకాలం కాపులను కంగాళీ చేసినట్టు రెడ్లను కంగాళీ చేయకుండా వుంటారని ఆశిద్దాం.