కూన జంప్ తో ఢిల్లీకి మెసేజ్! అంతా ఆయన డైరెక్షనేనా?
posted on Feb 22, 2021 @ 2:37PM
పాదయాత్రతో రేవంత్ రెడ్డి ఫుల్ జోష్ మీదున్నారు. ప్రియాంక గాంధీ సైతం రేవంత్ ను పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. ఇక రేపోమాపో వర్కింగ్ ప్రెసిడెంట్ కు పీసీసీ పగ్గాలు అప్పగిస్తారంటూ టాక్. ఇలాంటి కీలక సమయంలో రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కుతుబుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హస్తం పార్టీకి హ్యాండ్ ఇవ్వడం సంచలనంగా మారింది. కూన.. సడెన్ గా కాంగ్రెస్ ను వీడి జేపీ నడ్డా ఆధ్వర్యంలో కమలం పార్టీలో చేరిపోవడం కలకలం రేపుతోంది. తన గాడ్ ఫాదర్ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ ను కాదని బీజేపీలో చేరారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గ్రేటర్ లో రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ లీడర్ కూన. మల్కజ్ గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలుపులో శ్రీశైలం గౌడ్ దే కీ రోల్. కుతుబుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లతోనే ఎంపీగా రేవంత్ రెడ్డి గెలుపు సునాయాసంగా మారింది. వారిద్దరి మధ్య ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని పీసీపీ చీఫ్ చేయాలని మొదటి నుంచీ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు కూన శ్రీశైలం గౌడ్. అయితే.. తనకి పార్టీ పగ్గాలు అప్పగించకుండా సీనియర్లు అడుగడుగునా అడ్డుపడుతుండటం.. అధిష్టానం సైతం ఆలస్యం చేస్తుండటంతో.. కాంగ్రెస్ కు కాస్త ఝలక్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావించి ఉంటారని అంటున్నారు. అందులో భాగంగా.. తన ప్రధాన అనుచరుడు, గ్రేటర్ లో కీలక నాయకుడైన కూన శ్రీశైలం గౌడ్ ను బీజేపీలోకి రేవంతే పంపించి ఉంటాడని విశ్లేషిస్తున్నారు. హైకమాండ్ తీరు ఇలానే ఉంటే ముందుముందు మరింత మంది నేతలు కాంగ్రెస్ ను వీడనం ఖాయమనే మెసేజ్ హస్తినకు పంపించేలా 'కూన'తో మొదటి పావు కదిపారని చెబుతున్నారు.
బలమైన నాయకత్వం లేకపోతే ఇలానే వలసలు పెరుగుతాయని.. అందుకే సాధ్యమైనంత త్వరగా తనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే మంచిదని ఢిల్లీ పెద్దలకు తెలిసొచ్చేలా చేసేందుకు రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగడ అంటున్నారు. శ్రీశైలం గౌడ్ తోనే వలసలు ఆగిపోవని.. రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేయకపోతే మరింత మంది అనుచరులు పార్టీ మారడం ఖాయమని ఇప్పటికే 10 జన్ పథ్ కు రిపోర్టులు వెళ్లాయంటున్నారు.
సీనియర్లు వ్యతిరేకంగా ఉన్నా.. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ద్వితియ శ్రేణి కేడర్ అంతా రేవంత్ రెడ్డికి మద్దతుదారులుగా ఉన్నారు. వారందరికీ రేవంత్ రెడ్డే ఆశాకిరణం. ఇంకా సూటిగా చెప్పాలంటే.. రేవంత్ రెడ్డి ఉన్నారనే ఇంకా అనేక మంది లీడర్లు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. అయినా.. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం వెనుకా ముందు ఆడుతోంది. ఇది రేవంత్ రెడ్డిని అసహనానికి గురి చేస్తోందట. మరీ మెతకగా ఉంటే పని కాదని.. హైకమాండ్ కు ఓ షాక్ ఇవ్వాలని శ్రీశైలం గౌడ్ ను బీజేపీలోకి రేవంత్ రెడ్డే పంపించారని టాక్. అయినా, కోరుకున్న పార్టీ పదవి దక్కకపోతే.. చివరాఖరికి రేవంత్ రెడ్డి సైతం కాంగ్రెస్ ను వీడి కాషాయం కండువా కప్పుకుంటారనేది ఆయన అనుచరుల మాట.
రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఖాయం. కేసీఆర్ ను గద్దె దింపడమే రేవంత్ ఏకైక లక్ష్యం. అందుకోసం ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తన శక్తి మేర క్రుషి చేస్తారు రేవంత్ రెడ్డి. ఆయనలోని నాయకత్వ లక్షణాలు ఏ పార్టీకైనా అదనపు అడ్వాంటేజే. కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి ఎంతో అవసరం. ఆయనకు మాత్రం కాంగ్రెస్ తో కొంతే అవసరం. కేసీఆర్ ను పడగొట్టేందుకు ఏ పార్టీ అయితేనేం? అది కాంగ్రెసైనా ఓకే.. బీజేపీ అయితే డబుల్ ఓకే.. అన్నట్టుగా సాగుతోంది రేవంత్ రెడ్డి మైండ్ గేమ్.