జగన్ కు జైలా.. బెయిలా ? వైసీపీలో టెన్షన్ టెన్షన్
posted on May 29, 2021 @ 10:20AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకెళ్లడం ఖాయం? ఆయన బెయిల్ రద్దు కాబోతోంది? ఇదీ కొంత కాలంగా ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు. ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో, అంతకు ముందు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు. ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ పై జూన్ 1న విచారణ జరుగుతుండటంతో ఏపీ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కమలనాధులు చెబుతున్నట్లే సీఎం జగన్ బెయిల్ రద్దు కాబోతోందా అన్న చర్చ జరుగుతోంది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై కేంద్రం వైఖరి ఎలా ఉండబోతోంది, సీబీఐ కౌంటర్ ఎలా వేయబోతుంది అన్నది కీలకంగా మారింది. వైసీపీ నేతల్లోనే ఇదే టెన్షన్ కనిపిస్తోంది.
జగన్ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జగన్‌తోపాటు సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. లాక్‌డౌన్ పేరుతో జగన్ లాయర్, ఉన్నతాధికారుల అభిప్రాయం తెలుసుకోవాలంటూ సీబీఐ లాయర్ కౌంటర్ వేయకుండా వాయిదా కోరారు. దీనిపై సీబీఐ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ... జూన్ 1లోపు కౌంటర్ వేయకుంటే, తామే పిటిషన్‌పై నేరుగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. దీంతో ఈసారి కౌంటర్ ఖచ్చితంగా దాఖలు చేయాల్సిందే. దీంతో జగన్ బెయిలును రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? ‘ఔను... రద్దు చేయాలి!’ అంటుందా? లేక... ‘రద్దు చేయవద్దు.. బెయిలు నిబంధనలను ఆయన ఎంతమాత్రమూ ఉల్లంఘించడంలేదు’ అని చెబుతుందా? అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
అధికారంలోకి రాకముందు నుంచే బీజేపీతో జగన్ కు మంచి సంబంధాలున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అదే వైఖరి కొనసాగిస్తున్నారు. ప్రత్యేక హోదా మొదలుకుని, కొవిడ్ సమయంలోనూ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు జగన్. ఆక్సిజన్, వ్యాక్సిన్ కేటాయింపుల విషయంలోనూ లేఖలతోనే సరిపుచ్చుతున్నారు. ప్రధాని మోడీని జార్ఖండ్ ముఖ్యమంత్రి విమర్శిస్తే జగన్ కౌంటరిచ్చారు. జార్ఖండ్ సీఎంకు జగన్ ట్వీట్ అంశం జాతీయ స్థాయిలో రచ్చగా మారింది. బీజేపీ సర్కార్ కు జగన్ లొంగిపోయారనే విమర్శలు కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. జగన్ అలా ఎందుకు చేస్తున్నారో తెలుసంటూ జేఎంఎం నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. ఇక రాజకీయ ప్రాధాన్యమున్న కేసుల్లో సీబీఐ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో... జగన్ బెయిలు రద్దు పిటిషన్‌పై కేంద్రం డైరెక్షన్ లోనే సీబీఐ కౌంటర్ వేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
దర్యాప్తు సంస్థలు ఎక్కువగా నిందితుడికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటాయి. బెయిలు పిటిషన్లను వ్యతిరేకించడం, గరిష్ఠ శిక్ష విధించాలని కోరుతాయి. ఈ విధంగా చూస్తే... జగన్ బెయిలును రద్దు చేయాలని సీబీఐ కోరాలి. అదే జరిగితే... పెద్ద సంచలనమే. సీబీఐ ముందున్న మరో ‘ఆప్షన్’.. బెయిలు రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పడం. ఇది ఒక దర్యాప్తు సంస్థగా సీబీఐ చేయకూడని పని. ఎందుకంటే... రఘురామరాజు తన పిటిషన్‌లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరిస్తున్నారని.. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. పలువురు సాక్షులు జగన్ ప్రభుత్వంలో అధికారులుగా ఉండటం, కొందరు సహ నిందితులు కీలక స్థానాల్లో ఉండటం, ఒకరికి సలహాదారు పదవి ఇవ్వడం, విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపడం లాంటివన్నీ పిటిషన్‌లో వివరించారు. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను జీర్ణించుకోలేని వైసీపీ నేతలు న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇంత నిర్దిష్టమైన అంశాలు పేర్కొన్నప్పటికీ... జగన్ బెయిలు రద్దు చేయకూడదనే వైఖరికే సీబీఐ కట్టుబడితే అది కేంద్రం ‘సూచనల’ మేరకే జరిగినట్లు భావించాల్సి ఉంటుంది.
జగన్ బెయిలు రద్దుకు ఎస్ లేదా నో చెప్పడంతోపాటు సీబీఐ ముందు మరొక ఆప్షన్ కూడా ఉంది. అదేమిటంటే... ‘ఈ విషయంలో మేం జోక్యం చేసుకోం. మీరే నిర్ణయం తీసుకోండి’ అని బంతిని సీబీఐ కోర్టులోకే నెట్టేయడం. అలాగే... అసలు కౌంటరే వేయకుండా మౌనం పాటించవచ్చు. ‘జూన్ 1వ తేదీ నాటికి కౌంటర్ వేయకపోతే నేరుగా పిటిషన్‌పై విచారణ చేపడతాం’ అని కోర్టు ఇప్పటికే చెప్పింది. ఆ తర్వాత... విచారణ సమయంలో సీబీఐ అభిప్రాయాన్ని కోరే అవకాశముంటుంది. ఆ తర్వాత కేసులో ఏదైనా జరగవచ్చు. మొత్తంగా ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్.. ఇప్పుడు వైసీపీలో టెన్షన్ పుట్టిస్తోంది. జగన్ అనుచరులకు నిద్ర లేకుండా చేస్తోంది. జూన్ 1న జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ ఏపీ జనాల్లోనూ వ్యక్తమవుతోంది.