రీ ట్వీట్లలో విజయ్, లైకుల్లో కోహ్లి! ఈ ఏడాది ట్విట్టర్ టాప్ లిస్ట్ ఇదే
posted on Dec 9, 2020 @ 2:34PM
కరోనా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, హాథ్రస్ అత్యాచారం, షాహిన్‌బాగ్ అల్లర్లు, రైతుల నిరసన.. ఇవి ఈ ఏడాది ట్విటర్‌లో ఎక్కువ చర్చనీయాంశమైన అంశాల జాబితాలో నిలిచాయి. రామాయణ్, మహాభారత్ కార్యక్రమాలను తిరిగి టీవీలో ప్రసారం చేయడంపైనా ఎక్కువ మంది ట్విటర్‌లో చర్చించుకున్నారు. స్టూడెంట్ లైవ్స్ మ్యాటర్ కూడా ట్విట్టర్ లో ట్రెండింగులో నిలిచాయి. ఈ ఏడాది ట్రెండింగ్‌లో నిలిచిన ట్వీట్లను ట్విటర్ ఇండియా సంస్థ అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో జనవరి 1 నుంచి నవంబరు 15 మధ్య ట్రెండ్ అయిన ట్వీట్లకు ఈ జాబితాలో స్థానం కల్పించింది.
తమిళ సూపర్ స్టార్ విజయ్ రీ ట్వీట్లలో టాప్ గా నిలిచారు. అభిమానులతో కలసి తీసుకున్న విజయ్ సెల్ఫీకి అత్యధికంగా 1.61 లక్షలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. క్రికెటర్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్కశర్మ ప్రెగ్నెన్సీ విషయాన్ని పంచుకుంటూ చేసిన ట్వీట్ 6.44 లక్షలకు పైగా లైకులు సాధించి తొలి స్థానంలో నిలిచింది. కొవిడ్ సంక్షోభ సమయంలో భారతీయుల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఇళ్లలో దీపాలు వెలిగించాలని ఏప్రిల్ 3న ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ట్వీట్‌కు ట్విట్టర్ ప్రత్యేక గుర్తింపు దక్కింది. రాజకీయ రంగానికి సంబంధించి ఈ ఏడాది అత్యధిక రీట్వీట్లు పొందిన ట్వీట్‌గా ప్రధాని మోడీ ట్వీట్ నిలిచింది. పీఎం ట్వీట్‌ను 1.18 లక్షల మందికి పైగా రీట్వీట్ చేయగా, 5.13 లక్షల మంది లైక్ చేశారు.
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ఓ ట్వీట్ క్రీడారంగంలో అత్యధిక రీట్వీట్లు పొందిన ట్వీట్‌గా నిలిచింది. తను క్రికెట్ నుంచి రిటెర్మెంట్ ప్రకటించినప్పుడు ప్రధాని మోడీ తనకు ప్రత్యేకంగా రాసిన లేఖను పంచుకుంటూ ధోనీ ఆ ట్వీట్ చేశారు. కొవిడ్‌తో కుదేలైన వర్గాల ప్రజలను ఆదుకుంటానంటూ రతన్ టాటా చేసిన ట్వీట్ వ్యాపార రంగంలో అత్యధిక రీట్వీట్లు సాధించింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనకు కరోనా సోకిన విషయాన్ని పంచుకుంటూ చేసిన ట్వీట్‌ను ట్విటర్ ఇండియా గోల్డెన్ ట్వీట్లలో ఒకటిగా ఎంపిక చేసింది.