స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే కంటే.. యువగళం పాదయాత్రే ఎక్కువ నేర్పింది.. నారా లోకేష్
posted on Jan 27, 2025 @ 2:13PM
యువగళం పాదయాత్ర తనను ఎంతో మార్చిందనీ, ప్రజా నాయకుడిగా తనను తాను ట్రాన్స్ ఫార్మ్ చేసుకునే విషయంలో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే కంటే పాదయాత్రే ఎక్కవ దోహదం చేసిందనీ అన్నారు. రాజకీయాలలో పాదయాత్ర ఎంబీయే లాంటిదన్నారు.
యువగళం పాదయాత్రలో భాగంగా నాడు తాను ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తానన్నారు. అలాగే జగన్ హయాంలో చట్టాలను ఉల్లంఘించిన నాయకులు, అధికారులు ఎవరినీ వదిలిపెట్టేది లేదని పునరుద్ఘాటించారు. విశాఖలో సోమవారం (జనవరి 27) మీడియాతో మాట్లాడిన ఆయన రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతున్నదనీ, అక్రమాలు, అన్యాయాలు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనన్నారు. జగన్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయనీ, వాటన్నిటినై ఒకే సారివిచారణ చేపట్డడం సాధ్యం కాదన్నారు. జగన్ హయాంలో జరిగిన అన్ని వ్యవహారాలపై ఏకకాలంలో విచారణ జరిపించాలంటే రాష్ట్రంలో ఉన్న పోలీసులు సరిపోరని లోకేష్ చెప్పారు.
ఇక దావోస్ పర్యటనలో ఎంవోయూలు లేకపోవడంపై మీడియా ప్రశ్నలకూ లోకేష్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఎంవోయూలు, దావోస్ తో సంబంధం లేకుండానే ఈ ఏడు నెలలలో కూటమి సర్కార్ ఆరు లక్షల మందికి ఉపాధి కలిగే విధంగా రాష్ట్రానికి ఆరు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకువచ్చిందని చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను మీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏమిటో చెప్పగలరా అని నిలదీశారు. ఇక విజయసాయి రాజీనామాపై మీడియా అడిగిన ప్రశ్నకు సొంత తల్లి చెల్లినే నమ్మని జగన్ ఎవరినీ నమ్మరని, అవసరం తీరిన తరువాత కరివేపాకులా విసిరి ఆవల పారేస్తారనీ, విజయసాయి రెడ్డిదీ అదే పరిస్థితని బదులిచ్చారు. విజయసాయిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.