ద‌క్షిణాది దాదా సాహెబ్స్ వీరే!!!

 

మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్‌కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వ‌చ్చింది. దీంతో మ‌రో సౌతిండియ‌న్ ఈ అవార్డు ద‌క్కించుకున్న‌ వారిగా ఆయ‌న చ‌రిత్ర సృష్టించారు. ఇంత‌కీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ద‌క్కించుకున్న‌ ఫ‌స్ట్ సౌతిండియ‌న్ ఎవ‌ర‌ని చూస్తే ఆయ‌న బీఎన్ రెడ్డి. తెలుగులో ప‌దిహేను సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈయ‌న తొలి సౌతిండియ‌న్ దాదాసాహెబ్ ఫాల్కే విన్న‌ర్.

సెకండ్ దాదా సాహెబ్ ఫాల్కే విన్న‌ర్స్ కోవ‌లోకి వ‌చ్చే మ‌రో ద‌క్షిణాది న‌టుడు పైడి జయ‌రాజ్. నటుడు-దర్శకుడు జైరాజ్ భారతీయ చారిత్రక పాత్రల చిత్రణకు ప్రసిద్ధి. ఎన్నో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సైతం పొందారు జ‌య‌రాజ్.

మూడో వ్య‌క్తి విష‌యానికి వ‌స్తే న‌టుడు, ద‌ర్శ‌క నిర్మాత కూడా అయిన ఎల్వీ ప్ర‌సాద్. ఈయ‌న‌ సైతం ద‌క్షిణాది దాదా సాహెబ్ అవార్డు విజేత‌ల్లో ఒక‌రు. ప్ర‌సాద్ మూడు భాష‌ల్లో నిర్మించిన తొలి టాకీలో న‌టించ‌డం ద్వారా ప్ర‌త్యేక‌త సాధించారు. హిందీ ఆలం అరా, త‌మిళ కాళిదాసు, తెలుగు భ‌క్త ప్ర‌హ్లాద‌.. ఇవ‌న్నీ 1931లో రిలీజ‌య్యాయి. 1965లో ప్రసాద్ స్టూడియోస్ తో పాటు 1976లో క‌ల‌ర్ ఫిల్మ్ లాబ‌రేట‌రీ స్థాపించారు. ప్రసాద్ స్టూడియోస్ వివిధ భారతీయ భాషలలో 150కి పైగా చిత్రాలను నిర్మించడం గ‌మ‌నార్హం. 

ఇక బి నాగిరెడ్డి. ఈ పేరు ఆ రోజుల్లో ఒక బ్రాండ్. విజ‌య వాహిని స్టూడియోస్ స్థాప‌కులు నాగిరెడ్డి. ఆ స‌మ‌యంలో ఏసియాలోనే ఇదే అతి పెద్ద ఫిల్మ్ స్టూడియో కావ‌డం విశేషం. దీంతో నాగిరెడ్డికి సైతం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వ‌రించింది.  

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. తెలుగు సినిమా రెండు క‌ళ్ల‌లో ఒక‌రు. ఎన్టీఆర్ తో స‌మానంగా తొలినాళ్ల‌లో తెలుగు తెర‌ను ఏలిన  న‌టుడు. 250కి పైగా సినిమాల్లో న‌టించారు. అంతే కాదు అన్న‌పూర్ణ స్టూడియో ద్వారా ఇప్ప‌టికీ తెలుగు సినిమాకు సేవ‌లందిస్తూనే ఉన్నారు. నాగేశ్వ‌ర‌రావుకు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి స‌త్క‌రించింది కేంద్ర ప్ర‌భుత్వం.

ద‌క్షిణాది నుంచి దాదా సాహెబ్ పొందిన మ‌రో న‌టుడు క‌న్న‌డ కంఠీర‌వ రాజ్ కుమార్. 200 పైగా సినిమాల్లో న‌టించారాయ‌న. 1992లో ఉత్త‌మ పురుష నేప‌థ్య గాయ‌కుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న ఘ‌న‌త రాజ్ కుమార్ సొంతం. దీంతో పాటు రాజ్ కుమార్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సైతం పొందారు.

శివాజీ గ‌ణేశ‌న్. ద‌క్షిణాది.. మ‌రీ ముఖ్యంగా త‌మిళ సినిమా మార్క్ న‌ట‌న‌కు ముఖ‌చిత్రం లాంటి న‌టుడు. భావ వ్య‌క్తిక‌ర‌ణ‌, ప్ర‌తిధ్వ‌నించే స్వ‌రానికి ప్ర‌తీక‌. 1960లో ఆఫ్రో ఏషియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ లో బెస్ట్ యాక్ట‌ర్ గా అవార్డు పొందారు శివాజీ  గ‌ణేశ‌న్. ఇలాంటి అంత‌ర్జాతీయ అవార్డు పొందిన తొలి  భార‌తీయ న‌టుడు కూడా. ద‌క్షిణాది మార్ల‌న్ బ్రాండోగా అభివ‌ర్ణించింది ది లాస్ ఏంజిల్స్ టైమ్స్. శివాజీ గ‌ణేశ‌న్ కూడా ద‌క్షిణాది దాదాసాహెబ్ ల‌లో ఒక‌రిగా నిలిచారు.

ఆదూర్ గోపాల్ కృష్ణ‌న్. మ‌ల‌యాళ సినిమాలో కొత్త ర‌కం సినిమా ఉద్య‌మానికే మార్గ‌ద‌ర్శ‌కుడిగా నిలిచిన ద‌ర్శ‌కుడు. తొలి చిత్రం స్వ‌యంవ‌రంకే ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా జాతీయ అవార్డు పొందారాయ‌న‌. ఎంతో క్లిష్ట‌త‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను స‌ర‌ళీక‌రించి చిత్రించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. దీంతో ఆదూర్ సైతం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు.

యాభై ఏళ్ల సుదీర్ఘ తెలుగు చ‌ల‌న చిత్ర ప్ర‌యాణంలో డి. రామానాయుడిది ఒక ప్ర‌త్యేక అధ్యాయం.. వివిధ భార‌తీయ భాష‌ల్లో 130కి పైగా చిత్రాల‌ను నిర్మించారు. వీటిలో ఎక్కువ భాగం తెలుగులో నిర్మించిన‌వే. 9 భాష‌ల‌లో సినిమాలు తీసినందుకు గిన్నిస్ రికార్డు కూడా సాధించిన రామానాయుడు సైతం ద‌క్షిణాది దాదా సాహెబ్స్ లో ఒక‌రిగా  నిలిచారు.


ద‌క్షిణాది ద‌ర్శ‌క‌ దిగ్గ‌జం కే. బాల‌చంద‌ర్ సైతం దాదాసాహెబ్ అవార్డు విన్న‌రే. 1965లో మొద‌లైన ఆయ‌న కెరీర్.. లో వంద సినిమాల‌కు పైగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అంతే కాదు 1981లో క‌వితాల‌యా అనే చిత్ర నిర్మాణ సంస్థ‌ను సైతం స్థాపించి.. త‌న‌దైన శైలిలో భిన్నమైన‌ కుటుంబ చిత్రాల‌కు కేరాఫ్ గా నిలిచారు. దీంతో బాల‌చంద‌ర్ కి సైతం దాదాసాహెబ్ అవార్డు వెతుక్కుంటూ వ‌చ్చింది.

సౌండ్ రికార్డిస్ట్ గా ఫీల్డులో కెరీర్ మొద‌లు పెట్టిన కే. విశ్వ‌నాథ్ అర‌వై ఏళ్లు సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో.. ర‌క‌ర‌కాల చిత్రాల‌ను తెర‌కెక్కించారు. వీటిలో క‌ల్ట్ క్లాసిక్స్ అన‌ద‌గిన శంక‌రాభ‌ర‌ణం వంటి ఎన్నో చిత్రాలకు ప్రాణం పోశారు. ఒక స‌మ‌యంలో కే విశ్వనాత్ సినిమా అంటే ప‌డి చ‌చ్చిపోయే పిచ్చి ఫ్యాన్స్ ఉండేవారు.  దీంతో ఆయ‌న‌కు ఐదు జాతీయ అవార్డులు సైతం వ‌చ్చాయి. త‌న‌దైన సినీ నైపుణ్యానికి అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు సైతం పొందిన కేవీ.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సైతం పొందారు.

ఇక ర‌జ‌నీకాంత్ సంగ‌తి స‌రే స‌రి. అపూర్వ రాగంగ‌ళ్ అంటూ 1995లో మొద‌లైన ర‌జ‌నీ సినీ కెరీర్.. త‌ర్వాతి రోజుల్లో త‌మిళ మాస్ మూవీకే కేరాఫ్ గా నిలిచింది. సూప‌ర్ స్టార్ గా అవ‌త‌రించి త‌మిళ ప్రేక్ష‌ఖ హృద‌యాల్లో చోటు సంపాదించారు. ఇప్ప‌టికే ప‌ద్మ‌భూష‌ణ్, ప‌ద్మ‌విభూష‌ణ్ పొందిన ఆయ‌న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సైతం పొంది ద‌క్షిణాది సినిమాకు మ‌రో గౌర‌వం తీసుకొచ్చి పెట్టారు.

వ‌హీదా రెహ‌మాన్.. రోజులు మారాయి అనే సినిమాతో తెరంగేట్రం చేసిన వ‌హిదా రెహ‌మాన్ త‌ర్వాతి కాలంలో ఎన్నో హిందీ సినిమాల్లో న‌టించారు. ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ‌భూష‌ణ్ తో పాటు.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సైతం పొంది ద‌క్షిణాదికి గౌర‌వం తీసుకొచ్చి పెట్టారీ త‌మిళ‌నాడులో పుట్టిన న‌టీమ‌ణి.

ప్ర‌స్తుతం ద‌క్షిణాది నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మోహాన్ లాల్ సంగ‌తి చూస్తే.. త‌న ప‌ద్దెనిమిదేళ్ల వ‌య‌సులో.. 1978లో తెరంగేట్రం చేశారు. నాలుగు ద‌శ‌కాల‌కు పైగా త‌న సినీ ప్ర‌యాణంలో 350 సినిమాల్లో న‌టించారు. మ‌రీ ముఖ్యంగా మ‌ల‌యాళంలో మోస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ గ‌ల న‌టుల్లో మోహ‌న్ లాల్ కూడా ఒక‌రు. అప్ప‌ట్లోనే ఆయ‌న‌కు సూప‌ర్ స్టార్ గా బిరుదుండేది. ఐదు జాతీయ అవార్డులు పొందారు. 

వీటిలో రెండు ఉత్త‌మ నటుడు అవార్డులుండ‌గా.. ఒక జ్యూరీ అవార్డు కూడా ఉంది. ఇక 9 కేర‌ళ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌ను సైతం పొందారు మోహ‌న్ లాల్. 26 సంవ‌త్స‌రాల‌కే ఉత్త‌మ న‌టుడిగా నిలిచి ఈ కేట‌గిరీలో అతి పిన్న వ‌య‌స్కుడిగానూ పేరు సాధించారు. ఇక‌ 2011లో ప‌ద్మ‌శ్రీ.. 2019లో ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు సైతం పొందారు. ఇటు న‌టుడిగానే కాకుండా అటు నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్, సింగ‌ర్, డైరెక్ట‌ర్ ప‌లు విభాగాల్లో మ‌ల‌యాళ సినిమాకు సేవ‌లందించారు మోహ‌న్ లాల్. 

త‌న అభిమానుల చేత లాలెట్ట‌న్ అని ప్రేమ‌గా పిల‌వ‌బ‌డే మోహ‌న్ లాల్ గ‌త కొన్ని త‌రాలుగా మ‌ల‌యాళ సినిమాపై త‌న‌దైన ముద్ర వేస్తూ వ‌స్తున్నారు. ఆయ‌న డైలాగులు కేర‌ళ వాసుల నోళ్ల‌లో నానుతుంటాయంటే అతిశ‌యోక్తి కాదు. కేవ‌లం మ‌ల‌యాళ సినిమా మాత్ర‌మే కాకుండా భార‌తీయ దిగ్గ‌జ న‌టుల్లోనూ మోహ‌న్ లాల్ కి ఒక గుర్తింపు ఉంది. అలాంటి మోహ‌న్ లాల్ ప్ర‌స్తుతం ద‌క్షిణాది నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వారిలో చోటు ద‌క్కించుకున్నారు. ఎనీ హౌ కంగ్రాట్స్ మోహ‌న్ లాల్. వియ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటోంది యావ‌త్ ద‌క్షిణాది సినీ అభిమాన లోకం!!!

తెలంగాణకు పెట్టుబడులు రావడం కేసీఆర్‌కు ఇష్టం లేదు : శ్రీధర్‌బాబు

  తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావొద్దని ఇదే బీఆర్ఎస్ పాలసీ అని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్న దిగ్గజ కంపెనీలను కించపర్చడం మంచిది కాదని. ఒక సీనియర్ నాయకుడిగా మీకిది తగదని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హితవు పలికారు.  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో మేం  చేసుకున్న రూ.5.75 లక్షల కోట్ల ఎంవోయూలు అబద్ధమైతే .... జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, వ్యాపార దిగ్గజాలు కూడా గ్లోబల్ సమ్మిట్ కు రావడం అబద్ధమా అని  శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.  మీలాగా మాకు ‘గాల్లో మేడలు’ కట్టడం రాదు. అరచేతిలో స్వర్గం చూపించడం అసలే రాదు. ‘అబద్ధాల గురించి మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మంత్రి విమర్శించారు. వరంగల్ టెక్స్ టైల్ పార్క్’ మీద పేటెంట్ మీదా...? మరి మీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు...? ఒక ప్రణాళికా ప్రకారం మేం అసంపూర్తిగా మిగిలిపోయిన పార్క్ ను పూర్తి చేశామని తెలిపారు. అక్కడికి దిగ్గజ కంపెనీలను తీసుకొచ్చాం. దేశంలో ఇదే మొట్టమొదటి ఫంక్షనల్ పీఎం మిత్ర పార్క్. కేంద్రం నుంచి మా హయాంలోనే రూ.30 కోట్లు ఈ పార్కు అభివృద్ధికి తీసుకొచ్చామని పేర్కొన్నారు.  వాస్తవాలు మాట్లాడితే... ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్ లో పేటెంట్ కాంగ్రెస్ పార్టీది. ఈ రంగాల్లో తెలంగాణ ఇప్పుడు టాప్ లో ఉందంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎకో సిస్టం అభివృద్ధికి వేసిన పునాదులే కారణం. అవునా... కాదా..?  మంత్రి ప్రశ్నించారు. మీరు తొమ్మిదేళ్లలో ఐటీ ఎగుమతులను రూ.54వేల కోట్ల నుంచి రూ.2.43 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. మేం కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే రూ.2.43 లక్షల కోట్ల నుంచి రూ.3.23 లక్షల కోట్లకు తీసుకెళ్లామని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రపంచంల్లో మూడొంతుల వ్యాక్సిన్లు తెలంగాణ నుంచే  ఉత్పత్తి అవుతున్నాయి మంత్రి వెల్లడించారు

ఇదేం స్నేహంరా బాబోయ్... ప్రేమ కోసం ఎంత పని చేస్తారా?

  మంచి స్నేహితులు సన్మార్గంలో నడిపించడమే కాకుండా కష్టసుఖాల్లో తోడుగా ఉంటారని... అదే చెడు సహవాసం చేస్తే అది ఎప్పటికైనా మనల్ని అంతం చేస్తుందని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. ఇది అక్షర సత్యం... చాలాచోట్ల స్నేహితులే మరో స్నేహి తుడిని దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి... ఇలా వరుస హత్యలు జరుగుతూ ఉండడంతో పాతబస్తీ పరిధిలోని బాలాపూర్, పహాడీ షరీఫ్, చాంద్రాయణ గుట్ట తదితర ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే.. అయినా కూడా ఈరోజు తెల్లవారుజామున బాలాపూర్ లో ఓ యువ కుడు స్నేహితుల చేతిలో దారుణంగా గాయపడ్డాడు... రిహాన్ (17), శానవాజ్, మోహిజ్ ఈ ముగ్గురు స్నేహితులు కలిసి వట్టేపల్లి నుండి ఫంక్షన్ కని ఎర్ర కుంటకు కలిసి బయలు దేరారు...  బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట లో అర్ధరాత్రి సమయంలో ఈ ముగ్గురి మధ్య వాగ్వివాదం చెలరేగింది... పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగడంతో  శానవాజ్, మోహిజ్ ఈ ఇద్దరు స్నేహితులు  ఆగ్రహంతో ఊగిపోతూ స్నేహితుడు రిహాన్ పై ఒక్కసారిగా కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుండి పారిపోయారు... రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న రిహాన్ ను చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రిహాన్ను ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. రిహన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడిం చారు.  అమ్మాయితో ప్రేమ వ్యవహారమే ఈ హత్య యత్నానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కారణంగా స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు... ఇప్పటికే వరుస నేరాలు, హత్యలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో రాచకొండ సిపి ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి బాలాపూర్, పాతబస్తీ, పహడి షరీఫ్, చాంద్రా యణగుట్ట పరిసర ప్రాంతా ల్లో అర్ధరాత్రి సమయాల్లో తనిఖీలు నిర్వహిస్తూ పోకిరిలపై  కొరడా ఝళిపిస్తున్న కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు బయటికి రావాలంటేనే భయంతో వణికి పోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను ఆధారంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు

కోడి గుడ్లు, చికెన్ ధరలకు రెక్కలు

  రాష్ట్రవ్యాప్తంగా కోడి గుడ్లు, చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొద్ది నెలల క్రితం బహిరంగ మార్కెట్‌లో రూ.5 నుంచి రూ.6 మధ్య లభించిన కోడి గుడ్డు ధర ప్రస్తుతం రూ.8 నుంచి రూ.9 వరకు చేరింది. హోల్‌సేల్ మార్కెట్‌లోనే ఒక్కో కోడి గుడ్డు రూ.7.30కు విక్రయమవుతుండటం గమనార్హం. పౌల్ట్రీ రంగ చరిత్రలోనే ఇదే అత్యధిక ధర అని రైతులు, వ్యాపా రులు పేర్కొంటున్నారు.  ఇక చికెన్ ధర కూడా సామాన్య వినియోగదా రుడికి భారంగా మారింది. మార్కెట్‌లో చికెన్ కిలో ధర రూ.300కు చేరడంతో వినియోగం తగ్గుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో అందుబాటులో ఉన్న చికెన్, గుడ్లు ఇప్పుడు ఖరీదైన ఆహార పదార్థాలుగా మారుతున్నాయి. ధరలు ఇలా పెరగడానికి ప్రధాన కారణంగా ఉత్పత్తి తగ్గుదలనేనని పౌల్ట్రీ నిపుణులు సూచిస్తున్నారు. వేసవి ప్రభావం, మేత ఖర్చులు పెరగడం, కోళ్ల పెంపకంలో నష్టాలు వంటి అంశాల వల్ల గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని వారు చెబుతున్నారు.  అదే సమయంలో డిమాండ్ తగ్గకపోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు వివరిస్తున్నారు.ధరల పెరుగుదలతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా గుడ్లను ప్రధాన పోషకాహారంగా వినియో గించే పిల్లలు, వృద్ధుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్పత్తి పెరిగితే తప్ప ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గుడ్లు, చికెన్ ధరలు పెరిగిపో వడంతో సామాన్యులు వాటిని కొనేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది..  

పవిత్ర బంధానికి తూట్లు.. ప్రియుడి మోజులో భర్తను కడతేర్చిన భార్య!

  ఏడు అడుగులు వేసి, జీవితాంతం తోడుంటానని బాస చేసిన భార్యే కాలయముడిగా మారింది. పరాయి వ్యక్తి మోజులో పడి, కట్టుకున్న వాడినే కడతేర్చింది. సహజ మరణంగా చిత్రీకరించేందుకు "గుండెపోటు" నాటక మాడినా.. పోలీసుల విచారణలో అసలు నిజం బట్టబయలైంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే ‌... అశోక్,పూర్ణిమ దంపతులు... వీరికి పిల్లలున్నారు. బోడుప్పల్, ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసముంటు న్నారు. వి.జె. అశోక్ (45) శ్రీనిధి యూనివర్సిటీలో లాజిస్టిక్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య జె. పూర్ణిమ (36) ప్లే స్కూల్ నడుపుతోంది. పైకి అన్యోన్యంగా కనిపిస్తున్న వీరి కాపురంలో 'అక్రమ సంబంధం' చిచ్చు రేపింది. అదే కాలనీలో నివాసం ఉంటున్న భవన నిర్మాణ కార్మికుడు పాలేటి మహేష్ (22)తో పూర్ణిమకు పరిచయం ఏర్పడి, అది వివాేహేతర సంబంధానికి దారితీసింది.భార్య తీరుపై అనుమానం వచ్చిన అశోక్, ఆమెను పలుమార్లు మందలించారు. తన ఆనందానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన పూర్ణిమ.. ప్రియుడు మహేష్‌తో కలిసి భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి జరిగింది ఇదే.. డిసెంబర్ 11, 2025 సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చిన అశోక్‌పై, పథకం ప్రకారం మాటు వేశారు. మహేష్ తన స్నేహితుడు సాయి కుమార్ (22) సహాయం తీసుకున్నాడు. అశోక్ ఇంట్లోకి రాగానే మహేష్, సాయి ఆయనను పట్టుకోగా.. కట్టుకున్న భార్య పూర్ణిమ భర్త కాళ్లను గట్టిగా పట్టుకుంది. అనంతరం మహేష్ మూడు చున్నీలతో అశోక్ మెడకు ఉరి బిగించి దారుణంగా హత్య చేశాడు. అనుమానం రాకుండా హైడ్రామా.. హత్య అనంతరం నిందితులు అశోక్ బట్టలు మార్చి, రక్తపు మరకలున్న దుస్తులను, సాక్ష్యాలను మాయం చేశారు. డిసెంబర్ 12న పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తన భర్త బాత్‌రూమ్‌లో పడిపోయాడని, ఆసుపత్రికి తీసుకెళ్తే మృతి చెందాడని, గుండెపోటు వచ్చి ఉంటుందని నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసుల చాకచక్యం.. మొదట సాధారణ మరణంగా కేసు నమోదు చేసినా, దర్యాప్తులో పోలీసులకు అనుమానాలు రేకెత్తాయి. అశోక్ మృతదేహంపై బుగ్గలు, మెడ భాగంలో గాయాలు ఉండటాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ పుటేజీలు, టెక్నికల్ ఆధారాలను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. అశోక్ దిన దిశ కర్మ అయి పోయిన వరకు కూడా పూర్ణిమ చాలా చాకచక్యంగా వ్యవహరించింది ..అంతేకాదు పది రోజులపాటు తన భర్త లేడు అనే విషయాన్ని జీర్ణించుకో లేకుండా పోయింది.. ఒకవైపు భర్త లేడని నాటకం ఆడుతూనే మరోవైపు తన ప్రియుడితో నిత్యం చాటింగ్ చేస్తూ ఇక్కడ జరుగుతున్న విషయాలను ఎప్పటి కప్పుడు చేరవేసింది..  తన భర్త తనను తన పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడని నిత్యం రోదించింది ..కానీ ఇదంతా నాటకం అని పోలీసుల విచారణలో బయటపడింది.. దీన దిశ కర్మ పూర్తి అయిన వెంటనే పోలీసులు  విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిచి విచారించారు.. తనదైన స్టైల్ లో ఏమీ తెలియనట్టు బుకాయించే ప్రయత్నం చేసింది ..కానీ పోలీసులు తమదైన స్టైల్ లో విచారించడంతో చివరికి నిజాన్ని బయటకు వెళ్ళ గక్కింది.. తన ప్రియుడుతో కలిసి తాను ఈ హత్య చేశానని పేర్కొంది ..ఈ వరకు ప్రియుడు అయిన మహేష్ తో పాటు పూర్ణిమనీ పోలీస్ లు అరెస్టు చేశారు.. క్షణికావేశం, అక్రమ సంబంధాల మోజులో పచ్చని కాపురాన్ని కూల్చుకుని, కటకటాల పాలైన పూర్ణిమ ఉదంతం స్థానికులను విస్మయానికి గురిచేసింది.అనుమానాస్పద మృతిగా నమోదైన కేసును ఛేదించి సంచలన హత్యకేసును వెలికితీసిన మేడిపల్లి పోలీసుల పనితీరుపై ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు  

జీహెచ్‌ఎంసీ వార్డుల డీలిమిటెషన్‌పై పిటిషన్ కొట్టివేత

  జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్వ్యవస్థీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. 7 కార్పోషన్లు, 20 మున్సిపాలిటీలను ఇటీవల గ్రేటర్‌లో విలీనం చేసిన ప్రభుత్వం వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. దీనిపై అభ్యంతరాలు తెలుపుతూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు.  వార్డుల విభజను సవాల్‌ చేస్తూ హైకోర్టులో  పిటిషన్‌ దాఖలైంది.  ఎంసీహెచ్‌ఆర్‌డీలో సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సమర్పించిన నివేదిక ఆధారంగా వార్డుల పునర్విభజన చేశామని తెలంగాణ సర్కార్ ప్రభుత్వం చెబుతున్నా.. ఆ నివేదికను బయటపెట్టలేదని, అభ్యంతరాల స్వీకరణకు తగినంత గడువు ఇవ్వలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు వాదించారు. చట్టపరిధిలోనే వార్డుల విభజన నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు ప్రభుత్వం తరఫు అడ్వకేట్ బుధవారమే కోర్టుకు వివరించారు. 

రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం

  టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యా దపూర్వకంగా కలిశారు. ఆదివారం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతిని శాలువతో సత్కరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. తాను స్వయంగా గీసిన ఆంజనేయ స్వామివారి చిత్రపటాన్ని రాష్ట్రపతికి బహుకరించారు. రాష్ట్రపతిని కలసి గౌరవించడం పట్ల బ్రహ్మీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి.  బ్ర‌హ్మీ కేవలం నటుడే కాకుండా గొప్ప చిత్రకారుడు కూడా. ముఖ్యంగా పెన్సిల్ ఆర్ట్‌లో దేవుళ్ల చిత్రాలను అద్భుతంగా గీస్తారు. ఖాళీ సమయాల్లో తన మనసుకు నచ్చిన చిత్రాలను గీయడం ఆయనకు ఎంతో ఇష్టం. ఆయా చిత్రాలను తనను కలిసే ప్రముఖులకు బహుమతిగా అందించడం బ్రహ్మానందం ప్రత్యేకత. కృష్ణంరాజు నుంచి రామ్ చరణ్ వరకు ఎంతోమందికి ఆయన గీసిన చిత్రాలను అందించారు. 

సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారోత్సవంలో రభస

  నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ల ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా డీజేలో పెట్టిన పాటకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా  చెన్నారావుపేట గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ బలపరచిన కంది శ్వేత కృష్ణచైతన్య రెడ్డి ఎన్నికైంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి ఉప సర్పంచ్ బొంత శ్రీనివాస్ ఎన్నికయ్యారు.  ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు డీజేలో పాట పెట్టారు. ఇంతలో కాంగ్రెస్ కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్త వనపర్తి శోభన్ తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను పంపించారు. అనంతరం చెన్నారావుపేట ఎంపీడీవో వెంకట శివానంద్ సర్పంచ్ మిగతా వార్డుల సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించి ప్రమాణ చేయించారు.

ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్లపై విచారణ

  సామాజిక మాధ్యమాల్లో తమ ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు ఉపయో గిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నటులు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్లను జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారించింది. సోషల్ మీడియా వేదికలపై తమ చిత్రాలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అవమా నకరమైన పోస్టులు పెడుతు న్నారని, వాటి ద్వారా తమ ప్రతిష్ఠకు భంగం కలుగు తోందని పిటిషన్లలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.  ఈ విధమైన చర్యలు తమ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తు న్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈపిటిషన్లపై పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ తన వాదనలు కోర్టు కు వినిపించారు. తప్పుడు వార్తలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, అవమానకరమైన వీడియోలతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని ఆయన కోర్టుకు వివరించారు.ఈ వ్యవహారంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ సంస్థ లను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై స్పందించిన ప్రతివాదులు ఇప్పటికే కొన్ని వివాదాస్పద లింకులను తొలగించామని కోర్టుకు తెలిపారు.  అయితే, తొలగించబడిన లింకులపై తుది ఆదేశాలు జారీ చేసే ముందు సంబంధిత లింకులను వినియోగించిన ఖాతాదారుల వాదనలు కూడా వినాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు అభిప్రాయపడింది. అభిమానుల ఖాతాల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టుల విషయంలో ప్రత్యేకంగా స్పష్టమైన నిరాకరణ (డిస్‌క్లైమర్) ఉండాలని కోర్టు సూచిం చింది.ఈ అంశంపై గూగుల్ సంస్థ తమ ఖాతాదారులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని, అవసరమైతే సంబంధిత ఖాతాలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అలాగే, వివాదాస్పద పోస్టులకు సంబంధించిన ఐపీ లాగిన్ వివరాలను మూడు వారాల లోపు కోర్టుకు సమ ర్పించాలని ప్రతివాదులకు సూచించింది. వాదప్రతివాదనలు పూర్తి అయినా తరువాత కోర్టు తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది.

అమరావతిలో "ఆవకాయ్" ఉత్సవాలు : మంత్రి కందుల

  అమరావతిలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. ఈ వేడుకల్లో తెలుగు సినిమా సాహిత్యం, కవిత్వం, సంగీతం, నృత్యం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. పున్నమి ఘాట్, ద్వీపంలో ఈ ఉత్సవ ఏర్పాట్లు చేయునున్నట్టు తెలిపారు. అంతేకాకుండా వచ్చే ఉగాది నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు మంత్రి తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏపీలో షూటింగ్‌ చేసుకునే సినిమాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.  అలాగే ఉగాది నాటికి నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీనికి సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారని మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో  ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుందని  మూవీ టికెట్‌ రేట్లు, ఏపీలో షూటింగ్‌ చేసే సినిమాలు, హై బడ్జెట్‌ చిత్రాల టికెట్‌ ధరలపై చర్చించనున్నారు. అధికారుల సమావేశం అనంతరం సినీ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని, దానికి సంబంధించిన తేదీలను త్వరలో వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.