తాను ఇచ్చిన స్టేట్ మెంట్ పై మోహన్ బాబు నిలబడతాడా..?
posted on Apr 7, 2016 @ 12:15PM
సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయన రాజకీయ రీఎంట్రీ పై రాజకీయ వర్గాల్లో చర్చలు ఎక్కువయ్యాయి. తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని.. తనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ సన్నిహితులేనని.. అయితే తాను ఏ పార్టీలో చేరుతానన్న విషయం మాత్రం త్వరలో చెబుతానని తన పుట్టిన రోజునాడు చెప్పారు మోహన్ బాబు. అయితే తాను అలా చెప్పాడో లేదో.. అప్పటినుండి ఆయన ఏపార్టీలోకి చేరుతారబ్బా అని ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ.. ఆతరువాత కాస్తో కూస్తో బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ పార్టీనే. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు కూడా అయితే టీడీపీ లేదా.. వైసీపీలో మాత్రమే చేరే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీల్లోనే ఏ పార్టీలో చేరుతారన్నది ప్రధాన చర్చ. ఎందుకంటే గతంలో టీడీపీ పార్టీలో ఉన్న మోహన్ బాబు ఆ తరువాత.. అదే పార్టీనుండి రాజ్యసభనుండి కూడా ఎన్నికయ్యారు. ఇక ఆతరువాత టీడీపీ నుండి బయటకు వచ్చిన ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా అనగానే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు మోహన్ బాబు వైసీపీలో చేరుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగూ మోహన్ బాబుకి జగన్ తో మంచి సత్సంబంధాలే ఉన్నాయి.. ఇంకా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమార్తెతో తన పెద్ద కుమారుడు విష్ణుకు వివాహం జరిగింది కాబట్టి ఆపార్టీలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదు అని రాజకీయ పెద్దలు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ముద్రగడ కాపు గర్జన సందర్భంగా ముద్రగడ పద్మనాభాన్ని విష్ణు కలిసినందుకుగాను ఆయన వైసీపీలో చేరుతారేమో అన్న పలు వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా.. మోహన్ బాబు రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలను బట్టి తాను టీడీపీలోనే ఉంటారు అన్న వాదన కూడా వినిపిస్తోంది. పార్టీ ఫిరాయింపులు చేయడమంటే ఎంగిలి మెతుకులు తిన్నంత పని అని అన్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు తాను గతంలో ఉన్న పార్టీలోనే కొనసాగుతారు.. వైసీపీలో చేరరు అని అంటున్నారు. మరి ఇన్ని అనుమానాలకు బ్రేక్ వేస్తూ మోహన్ బాబు ఏపార్టీలో చేరుతారో.. సైకిలెక్కుతారో.. లేక ఫ్యాన్ ఎక్కుతారో తెలియాలంటే ఆగాల్సిందే.