మోడీ మాటల మర్మం.. స్థానాలు తగ్గుతాయన్న భయమేనా?
posted on May 28, 2024 @ 11:03AM
సార్వత్రిక ఎన్నికలు చివరిదశకు వచ్చాయి. ఏడు దశల్లో భాగంగా ఇక చివరి దశ మాత్రమే మిగిలింది. చివరి దశ పోలింగ్ వచ్చే నెల 1న జరగనుంది. స్వతంత్ర్య భారత చరిత్రలో ఎటువంటి ట్రెండ్ లేకుండా జరుగుతున్న సాధారణ ఎన్నికలు ఇవేనని అంటున్నారు. ప్రచారంలో మాటల తూటాలు పేల్చుకున్న, పేల్చుకుంటున్న పార్టీల హడావుడి తప్ప ఈ సాధారణ ఎన్నికలపై జనం పెద్దగా ఆసక్తిగా లేరని అంటున్నారు. పదేళ్ల పాలనలో మోడీ వైఫల్యాలపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ఆ వ్యతిరేకత విపక్ష కాంగ్రెస్ కూటమికి పెద్దగా సానుకూలత ఏర్పరచలేదనీ అంటున్నారు.
అయితే ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ విపక్షాలపై మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పై చేస్తున్న విమర్శలు ఆయనలోని ఫ్రస్ట్రేషన్ కు నిదర్శనంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా గతంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలనే ప్రస్తావిస్తూ ఆ తప్పిదాల వల్లే దేశం తీవ్రంగా నష్టపోయిందనడం దేనికి సంకేతమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఆరువిడతల పోలింగ్ లో 486 లోక్ సభ స్థానాలలో ప్రజల తీర్పు ఏమిటన్నది ఈవీఎంలలో నిక్షిప్తమైంది.
ఈ ఆరు విడతలలోనూ కూడా బీజేపీ పెర్ఫార్మెన్స్ ను బట్టి చూస్తే ఆ పార్టీ ఆశిస్తున్న భారీ విజయం అనుమానమేనన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. ముఖ్యంగా బెంగాల్, పంజాబ్, హర్యానా, ఒడిశా, తమిళనాడు, కర్నాటకలలో ఆ పార్టీకి తీవ్ర ఆశాభంగం తప్పదని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఇక జూన్ 1వతేదీ చివరి విడత పోలింగ్ జరుగనుంది.మొదటి,రెండో విడత పోలింగ్ లో బీజేపీ 100 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నది.మొదటి రెండు విడతల్లో దక్షిణాదిలో ఎక్కువ స్థానాల్లో పోలింగ్ జరిగింది.ఈ సారి దక్షిణాది లో 50-60సీట్లు వస్తాయని బీజేపీ భావిస్తున్నది. ఉత్తరాదిలో కొన్ని స్థానాలు కోల్పోతున్నామన్న అంచానకు వచ్చింది. ఉత్తరాదిలో కోల్పోయిన స్థానాలు దక్షిణాదిలో భర్తీ అవుతాయన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
తొలి విడత పోలింగ్ ముసిసిన క్షణం నుంచీ మోడీ ప్రచార శైలిలో మార్పు వచ్చింది. ఆయన మతం ప్రాతిపదికన ఓట్లు రాబట్టుకుని మరో సారి అధికారంలోకి రావాలన్న ప్రయత్నానికి తెరలేపారన్నది ప్రస్ఫుటంగా అర్ధం అవుతోంది. పంజాబ్ లో ఎన్నికల సభలో మోడీ సిక్కు ల పవిత్ర స్థలం కర్తార్ పూర్ షాహెబ్ గురుద్వారా పాకిస్తాన్ నుంచి భారత్ లో కలుపుకునే మంచి అవకాశాన్ని 1971 బంగ్లావిమోచన యుద్ధంలో అప్పటి ప్రధాని ఇందిర పోగొట్టారని విమర్శించారు. తానై తే అప్పుడు భారత్ ఆధీనంలో ఉన్న 90 వేల మంది పాక్ సైనికులు కర్తార్పూర్ ఇస్తే వదులుతామని షరతుపెట్టేవాడినని పేర్కొన్నారు. ఇది నిస్సందేహంగా సిక్కు ఓటర్లకు గాలం వేసే వ్యూహంగానే భావించాల్సి ఉటుంది.