మోడీ క్యాబినెట్ మంత్రుల జాబితా?
posted on May 26, 2014 @ 11:20AM
ఈరోజు సాయంత్రం భారతదేశ 15వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితం రాజ్ ఘాట్ సందర్శించి పూజ్య బాపూజీకి నివాళులు అర్పించారు. ఆ తరువాత డిల్లీలో గల గుజరాత్ భవన్ లో తన పార్టీ నేతలతో సమావేశమవుతారని సమాచారం. ఆయన చిన్న మంత్రి వర్గంతోనే సుపరిపాలన అందించాలని భావిస్తున్నందున, కొన్ని మంత్రిత్వ శాఖలను ఒకే గొడుగు క్రిందకు తీసుకువచ్చి వాటిన్నిటి బాధ్యత ఒకే మంత్రికి అప్పగించబోతున్నారు. ఉదాహరణకు రైల్వేస్, రోడ్డు రవాణా, షిప్పింగ్ మరియు విమానయాన శాఖలను ఒకే మంత్రి వర్గంగా మార్చబోతున్నారు. అదేవిధంగా మరికొన్ని ఇతర శాఖలను కూడా వాటి ప్రధాన శాఖలలో విలీనం చేయబోతున్నారు. మోడీ క్యాబినెట్ లో దాదాపు 16 క్యాబినెట్ హోదా గల మంత్రులు, మరో 14మంది సహాయ మంత్రులు ఉండవచ్చని తాజా సమాచారం. ఇప్పటికే వారి పేర్లతో కూడిన జాబితా రాష్ట్రపతి కార్యాలయానికి పంపడం జరిగింది. వారందరినీ రాష్ట్రపతి కార్యాలయం నుండి ప్రమాణస్వీకారానికి సిద్దంగా ఉండమని కోరుతూ ఆహ్వానాలు పంపడం జరిగింది.
తాజా సమాచారం ప్రకారం మోడీ క్యాబినెట్ లో స్థానాలు దక్కించుకోబోతున్న వారు ఎవరంటే: రాజ్ నాథ్ సింగ్-హోం శాఖ, అరుణ్ జైట్లీ-ఆర్ధిక శాఖ, నితిన్ గడ్కరీ-రైల్వే మరియు రోడ్లు రవాణ శాఖ, సుష్మ స్వరాజ్- విదేశాంగ శాఖ, రవి శంకర్ ప్రసాద్-ఐ.టీ., సమాచార, ప్రసార శాఖ హర్ష వర్ధన్-ఆరోగ్య శాఖ వీరితిబాటు మన రాష్ట్రం నుండి వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు మోడీ క్యాబినెట్ లో కేంద్రమంత్రులుగా చేరనున్నారు. వీరుగాక మేనక గాంధీ, వీకే సింగ్.పీయూష్ గోయల్ తదితరులు కూడా మోడీ మంత్రి వర్గంలో సహాయ మంత్రులుగా చేరే అవకాశం ఉంది.