ఏంటో పిచ్చి జనం.. జీఎస్టీ తగ్గిందని పరుగులు!
posted on Sep 24, 2025 @ 9:43AM
యాభై రూపాయల వస్తువును వందకు పెంచి.. ఆపై దాన్ని డెబ్భై ఐదు రూపాయలకు డిస్కౌంట్ పేరిట అమ్ముతుంటే ఎగబడి కొనడం మనకు నరనరాన జీర్ణించుకుపోయిన ఒకానొక దురలవాటు. అదే మనం మన పక్కింటి కిరాణా షాపుల్లోని సరుకులు.. మన అమ్మమ్మ బామ్మ వంటి వారు వీధుల్లో కుప్పలు పోసి అమ్మే కూరగాయలు.. ఇవన్నీ మనకు చాలా చాలా చౌక ధరలకే లభిస్తుంటాయి.
కానీ మనం ఎగేసుకుని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్తుంటాం. అక్కడ మనం పైన చెప్పుకున్నట్టు యాభై రూపాయల వస్తువును వందకు ఎంఆర్పీ వేసి.. దాన్ని డెబ్భై ఐదుకు భారీ డిస్కౌంట్ పేరిట అమ్మేస్తుంటే ఎగబడి మన ట్రాలీలో వేసేసుకుంటాం. అదేమంటే డెడ్ చీపుగా డిస్కౌంట్లో వచ్చిందని బడ్జెట్ పద్మనాభానికి మించిన బిల్డప్ ఇస్తుంటాం.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ అనే ఒక దక్షిణాదికి చెందిన, తెలుగింటి కోడలిగారి చేత చేయిస్తోన్న జీఎస్టీ గారడీ ఇదేనంటారు చాలా మంది ఆర్ధిక నిపుణులు. బేసిగ్గా గుజరాతీ బనియా బుద్ది ప్రకారం చూస్తే.. ప్రజల చేతిలో విరివిగా ఏదీ ఉండకూడదు. ఉంచ కూడదు. డబ్బంతా ఖజానాలో ఉండాలి. జనమంతా డబ్బు కోసం అంగలార్చుతుండాలి. ఇదే వారి మెయిన్ ఫైనాన్షియల్ పాలసీ.
ఇప్పటి వరకూ ఆ పాలసీని అమల్లో పెట్టడానికి ట్రంప్ టారీఫ్ ల కన్నా మించి.. వాడి జనం రక్తం పీల్చి పిప్పి చేసేశారు. మనమంతా ట్రంప్ మామ ఒక్కడే మనల్ని ఇంతగా పిండుతున్నాడని ఓ తెగ ఫీలై పోయాంగానీ.. మనల్నిఇక్కడ మోడీ తాత అంతకన్నా మించి పీల్చేసిన విషయం ఇటు జీఎస్టీలోనే కాదు అటు పెట్రోల్, గ్యాసు, మొబైల్ రీచార్జీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆనాటికీ ఈ నాటికీ ఎంతో ధరల తేడా కనిపిస్తుంది రెండు కళ్లు పెట్టి చూస్తే. వీటన్నిటికీ ప్రస్తుతం మనం ఒకటికి రెండు మూడు రెట్లు ఎక్కువగా చెల్లిస్తున్నాం.
ఈ క్రమంలో కాస్త ఊరటనిచ్చేలా నాలుగు జీఎస్టీ స్లాబులు తీసేసి రెండు స్లాబులు మాత్రమే ఉంచడం అది కూడా దసరా, దీపావళి ధమాకా పేరిట ఇవ్వడం చూస్తుంటే.. ఇదొక కార్పొరేట్ పాలసీగా చెప్పక తప్పదు. ఇందులో జనం సొమ్ము జనానికే పంచడం ఏదైతే ఉందో అది నభూతో అంటున్నారు చాలా మంది అర్ధశాస్త్ర నిపుణులు.
ఈ విషయం అర్ధం కాక టీవీలు, ఫ్రిడ్జిలు, కార్లు.. ఇతరత్రా భారీగా తగ్గాయని ఎగేసుకుని వెళ్తున్నాం మనమంతా.. దీన్నే అంటారు బనియా టెక్నిక్ అని కామెంట్ చేస్తున్నారు కొందరు సీఏ స్టూడెంట్స్.