మెజారిటీ రాకపోయినా మోడీ అజెండా మారలే..!
posted on Aug 20, 2024 7:03AM
ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి జనం సంపూర్ణ మెజారిటీ ఇవ్వలేదు. మోడీ, షా డబుల్ ఇంజిన్ సిద్ధాంతాన్ని దేశ ప్రజలు నిర్ద్వంద్వంగా నిరాకరించారు. అందుకే భాగస్వామ్యపక్షాల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని నడపలేని విధంగా తీర్పు ఇచ్చారు. అయినా ప్రధాని మోడీ తీరు మారలేదు. తనను వ్యతిరేకించే శక్తులను ఇసుమంతైనా సహించేది లేదని విస్పష్టంగా చెప్పేశారు. పంద్రాగస్టు నాడు ఎర్రకోట బురుజులపై నుంచి చేసిన ప్రసంగంలో మోడీ సమీప భవిష్యత్ లో తమ ప్రభుత్వం ఏం చేయబోతోందో శషబిషలకు తావు లేకుండా వెల్లడించారు.
దేశాన్ని తాను ఏ విధంగా నడిపించబోతున్నారో చెప్పడమే కాకుండా.. తన విధానాలకు అడుగడుగునా అడ్డు తగులుతున్న శక్తులు, పార్టీలకు పరోక్షంగా హెచ్చరికలూ జారీ చేశారు. కొన్ని వర్గాలకు,మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు అభ్యంతరకరమైన వివాదాస్పదమైన అంశాలను గురించి కూడా ఆయన బహిరంగంగా ప్రకటించేశారు. ఔను మోదీ మూడో సారి అధికారం చేపట్టిన తరువాత తొలి సారి ఎర్రకోటబురుజులపై చేసిన ప్రసంగంలో ఆయన తన అజెండా ఏమిటన్నది విస్పష్టంగా వెల్లడించారు. గత పదేళ్లుగా తన ప్రభుత్వం అనుసరించన విధానాలలో ఎటువంటి మార్పూ ఉండదని తేల్చేశారు. తమద సంకీర్ణ ప్రభుత్వమే అయినప్పటికీ, ఆధిపత్యం, పెత్తనం మాత్రం బీజేపీదేనని కుండబద్దలు కొట్టేశారు. ప్రజలు తన వ్యతిరేకతను స్పష్టంగా చాటిన ఉమ్మడి పౌరస్మృతి, ఒకే దేశం-ఒకే ఎన్నికలు వంటి అంశాలలో వెనకడుగే లేదని చాటారు.
అంతే కాదు తన ‘మిత్రుడు’ అదానీపై ఆరోపణలు చేయడమంటే దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడమేనని అన్యాపదేశంగా సెలవిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తుల ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించడం ద్వారా హిండెన్ బర్గ్ నివేదికను తప్పుపట్టారు. పెద్ద సంఖ్యలో యువతీ యువకులు రాజకీయాల్లోకి రావడం ఆహ్వానించదగ్గ అంశాలే అయినా ఉమ్మడి పౌరస్మృతి వంటివి వివాదాస్పద అంశాలనడంలో సందేహం లేదు. మోదీ ప్రసంగించే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని రెండవ వరుసలో కూర్చోబెట్టడం కూడా మోడీ అహంకారపూరిత వైఖరికి అద్దంపడుతోంది.
ఇక అవినీతిపై పోరాటం అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూనే.. నిఘా సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు ఉపయోగించుకుంటున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్రం పట్టించుకోవడం లేదు. మొత్తం మీద గత పదేళ్ల పాలనకు కొనసాగింపుగానే రానున్న ఐదేళ్ల పాలన ఉంటుందని మోడీ తన ప్రసంగంలో విస్ఫష్టంగా తేల్చేశారు.