ఏపీలో 'మొబైల్ టైలరింగ్'... పొట్టకూటి కోసం వీధుల్లో టైలరింగ్
posted on Oct 30, 2019 @ 12:58PM
ఫోన్ లోనే అన్ని పనులూ అయిపోతున్నాయి. ఇలాంటి కాలంలో టైలర్ వద్దకు వెళ్లి బట్టలు కుట్టించుకొనే వాళ్ల సంఖ్య తక్కువే. అయితే టైలరింగ్ నే నమ్ముకున్న వాళ్లు మాత్రం అందులోనే జీవనోపాధిని వెతుక్కుంటున్నారు. కొత్త బట్టలు కుట్టించుకోవాలంటే ఒకప్పుడు టైలర్ వద్దకే క్యూ కట్టేవారు. ఆ తర్వాత రెడిమేడ్ దుస్తుల హవా మొదలైంది. దీంతో షాపులకు నేరుగా వెళ్లి కొనుక్కునేందుకు అలవాటు పడ్డారు. ఇప్పుడేమో ఆన్ లైన్ జమానా నడుస్తోంది. మొబైల్ ఫోన్ లోనే షాపింగ్ చేసేస్తున్నారు. దీంతో టైలరింగ్ వృత్తిని నమ్ముకున్న వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. షాపుల్లోనే బట్టలు కుడదామంటే రోజు గడిచేలా లేదు. దీంతో టైలరింగ్ ను నమ్ముకున్న వాళ్లు రోడ్డెక్కుతున్నారు. బతుకు బండిని నడిపించేందుకు కష్టపడుతున్నారు. కొంత మంది రోడ్డు మీదనే కుట్టుమిషన్ పెట్టేశారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా తామూ మారక తప్పలేదని బతుకు జీవనం సాగిస్తున్నారు.
టైలరింగ్ వృత్తిని బతికించుకోవడమే కాదు పొట్టకూటి కోసం వీధుల్లో టైలరింగ్ చేసేస్తున్నారు. పొద్దున లేవగానే వాళ్ళు కుట్టు మిషన్ ను తీసుకొని రోడ్డు మీదకు వస్తారు. ఎక్కడైనా బట్టలు కుట్టేలా ఏర్పాట్లు చేసుకున్నారు. చౌరస్తాలో చెట్ల కింద బండిని ఆపుతారు. టైలరింగ్ సేవలని అందిస్తారు. అంటే ఇంటి వద్దకే టైలరింగ్ అన్నమాట. వీధిలలో టైలరింగ్ చేస్తున్న వారిలో శ్రీకాకుళం, విజయనగరం వాసులు ఎక్కువగా కనిపిస్తారు. అనాదిగా వీళ్ళది టైలరింగే ప్రధాన వృత్తి. దీంతో టైలరింగ్ ను వదులుకోలేకపోతున్నారు. పోటీ ప్రపంచంలో బతికేందుకు ఇలా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. విశాఖలో అద్దెకుంటూ జీవనం సాగిస్తున్నారు. మొబైల్ టైలరింగ్ చేసే కుటుంబాలు వైజాగ్ లో చాలా వరకు ఉన్నాయి. ఎదొరకంగా ప్రభుత్వమే ఆదుకోవాలని ఆర్థికంగా సాయం అందించాలని కోరుతున్నారు దర్జీలు. మారుతున్న కాలచక్రంలో మనం కూడా మారాలంటారు. అందుకే ఆదరణ కోల్పోతున్న ఈ టైలరింగ్ వ్యవస్థని బతికించుకోవడం కోసం వాళ్ళ బతుకు బండి లాగించడం కోసం ఈ మొబైల్ టైలరింగ్ విధానాన్ని కొత్తగా తీసుకువచ్చారు టైలరింగ్ వృత్తి దారులు.