విడదల రజనీ కోసం..!
posted on Mar 3, 2023 @ 12:47PM
చిలకలూరిపేటకు చెందిన వైసీపీ నేత మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కింది కానీ.. మంత్రి పదవి చాన్స్ అయితే లేదని పార్టీ వర్గాల్లోనే అంటున్నారు. ఈ పరిస్థితే ఆయన అనుచరులలో తీవ్ర అసంతృప్తికి కారణమౌతోంది. జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్ల తర్వాత తమ నాయకుడికి ఎమ్మెల్సీ మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. అలాంటి వేళ కేబినెట్ కూర్పు అంటే.. తేనెతుట్టెను కదిలించినట్లే అవుతోందని.. ఆ క్రమంలో ఆ ఆలోచన చేయకుండా ఉండడమే మేలనే ఓ భావనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు ఓ ప్రచారం అయితే ఆ పార్టీలో జరుగుతోందని వారు పేర్కొంటున్నారు. దీంతో తమ నేత మర్రి రాజశేఖర్‌కు మంత్రి అయ్యే యోగం లేదని వారు పెట్టుకొన్న ఆశలను సైతం వదులుకొంటున్నట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల ప్రచారంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా విడదల రజినీని గెలిపిస్తే.. మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి.. . తన కేబినెట్‌లో మంత్రిగా తీసుకొంటానని.. సదరు నియోజకవర్గ ప్రజలకు జగన్.. మాట ఇచ్చారని.. అలా ఆ ఎన్నికల్లో రజినీ అయితే గెలిచింది.. ఆమె మంత్రి పదవి సైతం చేపట్టిందని.. అలాగే ఈ నాలుగేళ్లలో పలుమార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా.. ముఖ్యమంత్రి జగన్ మాత్రం.. పలువురికి ఎమ్మెల్సీ పదవులు కేటాయించి... శాసనమండలికి పంపారని మర్రి రాజశేఖర్ అనుచర వర్గం ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది.
మరోవైపు ఈ నాలుగేళ్లలో తమ నాయకుడు మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇవ్వకుంటే.. ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి కానీ.. మరేదైనా పదవి కానీ కట్టబెడతారని ఆయన అనుచరగణం కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూసిందని.. కానీ అవేమీ లేకుండా.. ఊరించి.. ఊరించి.. ఎన్నికలు ఎన్నికలు సమీపిస్తున్నాయనగా ఇలా ఎమ్మెల్సీ పదవి కేటాయించడం పట్ల.. ఆయన కేడర్ ఒకింత నిరాశ నిస్పృహాకు గురైనట్లు ఓ ప్రచారం అయితే జరుగుతోంది. ఇంకోవైపు.. కొద్ది మాసాల ముందే.. కృష్ణా జిల్లా పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ పదవిని మర్రి రాజశేఖర్‌కు జగన్ కట్టబెట్టారని వారు పేర్కొంటున్నారు.
అదీకాక.. వచ్చే ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ దేవుడికే ఎరుక.. ఆ తర్వాత ప్రభుత్వం మారితే.. తమ నేత పరిస్థితి ఏమిటని ఆయన వర్గం ఆందోళనతో ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. మర్రి రాజశేఖర్ సామాజిక వర్గం కారణంగానే ఆయనకు ఇప్పటి వరకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదనే ఓ ప్రచారం సైతం చిలకలూరిపేట నియోజకవర్గంలో జోరందుకొందని తెలుస్తోంది.
ఇక వచ్చే ఎన్నికల్లో మళ్లీ చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా విడదల రజినీ బరిలోకి దిగనున్నారని.. ఆమె అభ్యర్థిత్వానికి అసమ్మతి సెగ తలగకుండా... ఆమె గెలుపు నల్లేరు మీద నడకలా సాగడం కోసమే.. మర్రి రాజశేఖర్‌కు ఈ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సంతృప్తి పరిచారనే ప్రచారం సైతం ఆయన వర్గంలో చాలా బలంగా సాగుతోంది.
వచ్చే ఎన్నికల ప్రచారం వేళ.. ముఖ్యమంత్రి, ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్.. మళ్లీ ఈ నియోజకవర్గానికి వచ్చి.. మర్రి రాజశేఖర్‌ను ఇప్పటికే ఎమ్మెల్సీ చేశామని.. మళ్లీ అదికారంలోకి వస్తే.. ఆయనకు మంత్రి పదవి కేటాయిస్తానని.. అది కూడా కీలక శాఖ కట్టబెడతానంటూ హామీ ఇచ్చే అవకాశం ఉందని మర్రి రాజశేఖర్ వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఓ వేళ వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైయస్ జగన్ పార్టీ విజయం సాధించినా.... గతంలో లాగే తమ నేత మర్రి రాజశేఖర్‌ను మరిచిపోతే.. పరిస్థితి ఏమిటని ఆయన వర్గం సూటిగా ప్రశ్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ నేత రాజశేఖర్ సూచనలకు అనుగుణంగా నచుకొంటామని ఆయన వర్గం స్పష్టం చేస్తోంది. మరి మర్రి రాజశేఖర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది వేచి చూడాల్సిందే.
మరోవైపు గతంలో మాజీ మఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య సంతాప సభను నియోజకవర్గంలో నిర్వహించిన సమయంలో మర్రి రాజశేఖర్ బావమరిది మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో మర్రి రాజశేఖర్‌కు గుర్తింపు లేకుండా పోయిందని ఆరోపించారు. మరో పార్టీలో మర్రి రాజశేఖర్ ఉంటే.. ఆయన పరిస్థితి మరోలా ఉండేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారని ఆయన వర్గం ఈ సందర్భంగా గుర్తు చేస్తోండడం గమనార్హం.