పంగనామాల పీఆర్సీ!.. ఉద్యోగులను దగా చేసిన జగన్‌రెడ్డి!
posted on Feb 7, 2022 @ 10:25AM
చర్చల పేరుతో పీఆర్సీ సాధన సమితి నేతలతో సమ్మె విరమణ చేయించుకుని వైయస్ జగన్ రెడ్డి ప్రభుత్వంపై పైచేయి సాధించిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వైయస్ జగన్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం పీఆర్సీ సాధన సమితి నేతలకు నచ్చిన.. ఉద్యోగులకు మాత్రం నచ్చలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు ఉద్యమ సంఘం నేతల మీద ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్ర పీఆర్సీల చరిత్రలోనే వైయస్ జగన్ రెడ్డిదీ పంగనామాల పీఆర్సీ అంటూ ఉద్యోగులు ఎద్దేవా చేస్తున్నారు.
అయితే ఈ పీఆర్సీతో ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు ఆరోపించారు. భవిష్యత్తులో ఎన్ని పీఆర్సీలు వచ్చినా.. రికవరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పీఆర్సీపై మంత్రుల సబ్ కమిటీ పేరుతో పెద్ద నటకమే నడిచిందంటూ మరో ఎమెల్సీ బాజ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల జగన్ ప్రభుత్వానికి మేలు జరిగింది కానీ... ఉద్యోగస్తులకు మాత్రం తీవ్ర నష్టమే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. 23 శాతం పీఆర్సీలో మార్పు కోసం మంత్రుల కమిటీ ఆంగీకరించకపోవడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు.
జగన్ రెడ్డి ప్రభుత్వ పీఆర్సీతో 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, ఫించనర్లు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని ఆయన గుర్తు చేశారు. అయితే పీఆర్సీ కథను కంచికి చేర్చిన ఘనత మాత్రం ఈ నాయకులకే దక్కుతోందని ఎమ్మెల్సీ బాబ్జీ అన్నారు. దీనిపై ఉద్యమం చేయడానికి సిద్ధంగా తామంతా ఉన్నామని చెప్పారు.
చట్టసభల లోపల, బయట కూడా పీఆర్సీపై పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో పీఆర్సీ సాధన సమితి ఉద్యమ కార్యాచరణను విరమించుకోవడం ఉద్యమాన్ని తాకట్టు పెట్టడమేనని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ విమర్శించారు.