రాజీనామాపై తేల్చండి.. స్పీకర్‌ను కలిసిన గంటా
posted on Mar 25, 2021 @ 2:52PM
రాజీనామా ఆమోదించుకోవడంపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దూకుడు పెంచారు. శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. తన రాజీనామా లేఖను ఆమోదించాలని కోరారు. గంటా అభ్యర్థనను విన్న స్పీకర్.. వారం రోజుల్లో అమరావతి వెళ్లి పరిశీలిస్తానని స్పీకర్ తమ్మినేని చెప్పారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ టీడీపీకి చెందిన విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. మొదట చేసిన రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేకపోవడంతో, మరోసారి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను తమ్మినేని సీతారంకు పంపించారు. అయితే, గంటా రాజీనామాపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం గంటా రాజీనామా స్పీకర్ పరిశీలనలో ఉంది. అందుకే, తన రాజీనామాను ఆమోదించాలంటూ స్పీకర్‌ను కలిసి విన్నవించారు గంటా. రాజీనామాల ద్వారానే కేంద్రంపై రాజకీయ ఒత్తిడి పెరుగుతుందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదాకా ఉద్యమాన్ని విరమించేది లేదన్నారు గంటా శ్రీనివాసరావు.