మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలగిన మిస్ ఇంగ్లాండ్
posted on May 24, 2025 @ 5:04PM
హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నుంచి బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా వైదొలగింది. తొలుత తాను వ్యక్తిగత కారణాలతో వైదొలగుతున్నానని చెప్పిన మాగీ.. ఆ తరువాత మాత్రం సంచలన ఆరోపణలు చేశారు. ది సన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న తీరుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ పోటీల్లో కేవలం ప్రదర్శన ఇచ్చే కోతుల్లా తమను చూస్తున్నారని ఆమె విమర్శించారు. అంతే కాకుండా తనను ఓ వేశ్యలా ట్రీట్ చేశారని, ఈ తీరు తనను మానసికంగా తీవ్రంగా గాయపరిచిందని మాగీ వెల్లడించారు.
24 ఏళ్ల మిల్లా మాగీ, గత ఏడాది మిస్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచి భారతదేశంలో మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి వచ్చింది. మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా జరిగిన వివిధ కార్యక్రమాలలో కంటెస్టంట్లను మగస్పాన్సర్ల ముందు కవాతు చేయించడానికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బ్యూటీ విత్ ఏ పర్పస్ అన్న స్ఫూర్తికి భిన్నంగా అందం ప్రదర్శనకు మాత్రమే అన్నట్లుగా ఈ పోటీల తీరు ఉందని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలగాలన్న మిల్లా మాగీ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానికి షాక్ అనే చెప్పాలి.