నిర్వాహణా లోపంతో ఏపీ గ్లోబల్ సమ్మిట్ అభాసుపాలు
posted on Mar 3, 2023 @ 4:16PM
జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠత్మకంగా విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ లోపం కారణంగా అభాసుపాలైంది. గత రెండు రోజులుగా గ్లోబల్ సమ్మిట్ లో రుచికరమైన భోజనం, అద్భుతమైన మెనూ అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంది. తీరా మొదటి రోజే కనీసం సగం మంది కూడా భోజనాలు చేయకుండానే మెనూ ఖాళీ అయిపోయింది. దీంతో డిలిగేట్స్ నిర్వాహకులతో గొడవ పడ్డారు.
అలాగే సమ్మిట్ కిట్ల పంపిణీ కూడా గందరగోళంగా తయారైంది. అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. కిట్ల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన స్టాల్ ధ్వంసమైపోయింది. అసలు గ్లోబల్ సమ్మిట్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో ఎవరు ఇన్వెస్టర్లు, ఎవరు కాదు అన్న విషయమే తెలియని పరిస్థితి నెలకొంది. దాదాపు 15 నుంచి 16 వేల మందికి వరకూ గ్లోబల్ సమ్మిట్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే వారిలో అత్యధికులుఇన్వెస్టర్లు కాదని అంటున్నారు. సరదాగా చూడటానికో ఉచిత రిజిస్ట్రేషనే కదా చేయించుకుని వెళితే ఏం పోయింది అనుకుని వచ్చిన వారే అధికం. ఇక ప్రభుత్వం కూడా సమ్మిట్ కు పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు వచ్చారని చాటుకునేందుకు ఎవరు వస్తే వారిని అనుమతించేసింది. ఆ విషయం పక్కన పెడితే.. భోజన విరామం సమయంలో ముందుగా విదేశీ ఇన్వెస్టర్లను అనుమతించి, ఆ తరువాతే మిగిలిన వారికి అని ప్రకటించడంతో సమ్మిట్ కు వచ్చిన వారు చాలా సేపు భోజనాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది.
తీరా విదేశీ ఇన్వెస్టర్ల తరువాత మిగిలిన వారిని అనుమతించేసరికి అక్కడా తొక్కిసలాట చోటు చేసుకుంది. సగం మందికి సర్వ్ చేసే సరికే భోజనాలు అయిపోయాయి. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఘర్షణ జరిగే పరిస్థితి ఏర్పడింది. సమ్మిట్ కు వచ్చిన వారు నిర్వాహకులతో గొడవ పడ్డారు. ఆగ్రహంతో బయటకు వెళ్లిపోవడం కూడా కనిపించింది.
అదే పరిస్థితి సమ్మిట్ కిట్ల పంపిణీ వద్ద కూడా చోటు చేసుకుంది. టెంట్ లో ఏర్పాటు చేసిన కిట్ల పంపిణీ కౌంటర్ ధ్వంసమైపోయింది. మొత్తం మీద ఏపీ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు పెట్టుబడులు ఏ మేరకు వచ్చాయన్నది పక్కన పెడితే.. భోజనాల దగ్గర, కిట్ల పంపిణీ వద్ద జరిగిన తొక్కిసలాట, తోపులాటతో అభాసుపాలైందని సదస్సుకు వచ్చిన వారే చెబుతున్నారు.