అమరావతికి అయోధ్యకు పోలికా.. ఏపీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్
posted on Aug 6, 2020 @ 5:35PM
ఏపీలో అమరావతి అంశం పై రచ్చ మాములుగా లేదు. ఈ విషయంలో టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఏపీ మంత్రి పేర్ని నాని తాజాగా కౌంటర్ ఇచ్చారు. అయోధ్యతో అమరావతిని పోల్చడాన్ని ఈ సందర్భంగా ఆయన తప్పుబట్టారు. అయోధ్యతో అమరావతికి ఎక్కడా అసలు పోలికే లేదని ఆయన వ్యాఖ్యానించారు.
అయోధ్య పుణ్యభూమి అని ఐతే అమరావతి మాత్రం పాపాలపుట్ట అని మంత్రి అన్నారు. అంతే కాదు అమరావతి పవిత్రస్థలం కాదు.. పాపాల పుట్ట అనే విషయం ప్రధాని నరేంద్రమోదీకి కూడా అర్థమైందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పోలవరం చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని గతంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారని అయన గుర్తు చేసారు.
అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ఎలాంటి విధానాన్ని అవలంభించారో అందరికీ తెలుసని పేర్ని నాని ఎద్దేవా చేసారు. కేవలం డబ్బులు లెక్కపెట్టడం మాత్రమే తెలిసిన నారాయణ చెబితేనే రాజధానిని అమరావతిలో పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు.
ఎప్పుడూ టీవీల్లో కనిపించకపోతే చంద్రబాబుకు తోచదని పేర్ని నాని విమర్శించారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చంద్రబాబు చేసిన డిమాండ్‌పై మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. కనీసం ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌కు కూడా దిగని చంద్రబాబు తమకు సవాళ్లు విసరడమేమిటని అయన వ్యాఖ్యానించారు.