గెలిచిన , ఓడిన ప్రముఖులు
posted on May 2, 2021 @ 5:13PM
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వచ్చాయి. హోరాహోరీ పోరు సాగిన పశ్చిమ బెంగాల్ లో ఎవరూ ఊహించని విధంగా రెండు వందలకు పైగా సీట్లులో విజయం సాధించింది తృణామూల్ కాంగ్రెస్. ముచ్చటగా మూడోసారి గెలుపుతో హ్యాట్రిక్ కొట్టారు మమతా బెనర్జీ. అయితే నందిగ్రామ్ లో మాత్రం గెలుపు కోసం దీదీ చివరి వరకు పోరాడారు. ఆమె తన ప్రధాన ప్రత్యర్థి, బీజేపీ నేత సువేందు అధికారిపై పన్నెండు వందలకు పైచిలుకు ఓట్ల తేడాతో నెగ్గారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి మమతా, సువేందు మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఒక రౌండ్ లో మమతా ఆధిక్యంలో ఉంటే, మరో రౌండులో సువేందు ఆధిక్యంలోకి వస్తుండడంతో విజయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.చివరకు స్వప్య ఆధిక్యంతో గట్టెక్కారు మమతా బెనర్జీ. శిబపూర్ నియోజవర్గంలో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇండియన్ క్రికెటర్ మనోజ్ తివారి గెలపొందారు. టోలీగంజ్ నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి బబూల్ సుప్రియో ఘోరంగా ఓడిపోయారు.
కేరళలో ధర్మదాం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ గెలిచారు. పూతుపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి ఉమెన్ చాందీ గెలిచారు. కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్ తాను పోటీ చేసిన కొణ్ణి, మంజేశ్వర్ రెండు సీట్లలోనూ ఓడిపోయారు. కేరళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మెట్రో శ్రీధరన్ పాలక్కాడ్ లో పరాజయం పాలయ్యారు. త్రిస్సూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటుడు సురేష్ గోపి ఓడిపోయారు.
తమిళనాడులో డీఎంకే చీఫ్ స్టాలిన్, ముఖ్యమంత్రి పళనీ స్వామి ఎడప్పాడిలో విజయం సాధించారు. శశికళ మేనల్లుడు దినకరన్ ఓడిపోయారు. చెపాక్ లో ఉదయనిది స్టాలిన్ గెలుపొందారు. దక్షిణ కోయంబత్తూరులో కమల్ హాసన్ విజయం సాధించారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నటి ఖుష్బూ సుందర్ ఓడిపోయారు. యానాంలో మాజీ సీఎం రంగస్వామి స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.