పిఠాపురానికి రామ్ చరణ్..జనసేనానికి మద్దతు!
posted on May 11, 2024 @ 9:31AM
మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన బాబాయ్ కోసం పిఠాపురం వెళ్లనున్నారు. తన తల్లి సురేఖతో కలిసి ఆయన శనివారం పిఠాపురం వెడుతున్నారు. ఆయన నేరుగా పవన్ కల్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేయరు. ఆయన తన తల్లితో కలిసి కుక్కుటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రామ్ చరణ్ నేరుగా ప్రచారంలో పాల్గొని పవన్ కల్యాణ్ కు ఓటు వేయమని ప్రజలకు పిలుపునివ్వకపోయినా, కచ్చితంగా పిఠాపురంలో మీడియాతో మాట్లాడతారు.
తన బాబాయ్ కు మద్దతు పలుకుతారు. ఇంత కచ్చితంగా చెప్పడానికి కారణమేమిటంటే ఆయన పిఠాపురం వెళ్లి కుక్కుటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఎన్నుకున్న సమయమే కారణం. సరిగ్గా ఎన్నికల ప్రచారం ముగిసే చివరి రోజునే రామ్ చరణ్ తన తల్లితో కలిసి పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఇది కచ్చతంగా తన బాబాయ్ కు మద్దతును తెలియజేయడమే అవుతుంది.
అంటే రామ్ చరణ్ తన బాబాయ్ కోసం పరోక్షంగా ప్రచారం చేసినట్లేనని జనసేన శ్రేణులు అంటున్నారు. రామ్ చరణ్ పిఠాపురం పర్యటన అదీ ఎన్నికల ప్రచారం గడువు ముగిసే చివరి రోజున నిస్సందేహంగా జనసేనలో జోష్ నింపుతుందని చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు మెగా ఫ్యామిలీ అంతా పవన్ కల్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి నేరుగా పిఠాపురం వచ్చి ప్రచారం చేయకపోయినా.. వీడియో సందేశం ద్వారా తన తమ్ముడికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు తన వంతుగా రామ్ చరణ్ కూడా పిఠాపురంలో పర్యటించి తన బాబాయ్ కు మద్దతుగా నిలిచారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా మద్దతు ప్రకటించారు.