ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర.. రూ.75 కోట్లు కేటాయించిన సర్కార్
posted on Jan 13, 2024 9:01AM
తెలంగాణ మహా కుంభమేలాగా గుర్తింపుపొందిన వనదేవతల జాతర సమ్మక్క సారలమ్మ. మేడారం జాతరగా పిలువబడే ఈ జాతర వచ్చే నెల 21 నుంచి ఆరంభం కానుంది. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి సీతక్క ప్రకటించారు. జాతర ఏర్పాట్ల పర్యవేక్షణకు మేడారంలో పర్యటించని మంత్రి సీతక్క ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె జాతర నిర్వహణకు 75కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేసినట్లు చెప్పారు. జాతర నిర్వహణ కోసం వెంటనే నిధులను విడుదల చేసినట్లు చెప్పారు. ఇంత పెద్ద జాతరకు 75 కోట్లేనా అన్న సంశయాలు వద్దని చెప్పిన సీతక్క, జాతర సందర్భంగా ఎవరీకీ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకుంటామనీ, అందకు సంబంధించి ప్రణాళికలు రూపొందించామనీ చెప్పారు. జాతర పనులు శాశ్వత ప్రాతిపదికన చేస్తామనీ, శానిటేషన్, ట్రాఫిక్, ఆర్టీసీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలపై దృష్టి సారించామనీ వివరించారు. జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి పంపించామనీ, అలాగే నిధుల కోసం ప్రతిపాదనలు కూడా పంపించామనీ సీతక్క వివరించారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుందని ఆశిస్తున్నట్లు సీతక్క చెప్పారు.
రెండేళ్లకోసారి జరిగే ఈ వనదేవతల జాతరకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తారు. అడవి తల్లులను దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందన్న నమ్మకం గిరిజనులలో బలంగా ఉంది. ఈ జాతర విశిష్టత ఏమిటంటే.. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఈ మేడారం గిరిజన జాతర.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతుంది. ములుగులో మనుగడలో ఉన్న అతిపెద్ద అటవీ ప్రాంతం అయిన దండకారణ్యంలో భాగమైన ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యంలోని మారుమూల ప్రాంతం మేడారం. 1988కి ముందు వరకూ ఈ జాతరకు కేవలం ఎడ్లబండ్ల మీద మాత్రమే వెళ్లాల్సి వచ్చేయి. అయితే 1998లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా వేడుకగా ప్రకటించింది. రహదారి సౌకర్యం కల్పించింది. ప్రకటించింది మరియు మోటారు రహదారిని ఏర్పాటు చేసింది.