నందమూరి వంశం నుండి మరో బాల నటుడు
posted on Mar 25, 2013 @ 9:49PM
తెలుగు చిత్ర సీమకు హీరోయిన్లను ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవలసి ఉందేమోగానీ, హీరోలకి మాత్రం కరువులేదు. నందమూరి, అక్కినేని, మెగా స్టార్, సూపర్ స్టార్, రెబెల్ స్టార్ మొదలయిన అన్ని కుటుంబాలు తెలుగు చిత్ర సీమకు హీరోలను అందించే అక్షయ పాత్రలంటే అతిశయోక్తి కాదు. కొత్తగా ప్రవేశిస్తున్నవారు కూడా తమ తాతముత్తాతల పరపతి మీద ఆదారపడకుండా తమ స్వీయ శక్తితోనే పైకి వచ్చి ప్రజలను మెప్పిస్తున్నారు. అభిమానులను సంపాదించుకొన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మరియు నందమూరి కుటుంబాల నుండి మరో ఇద్దరు నటులు త్వరలో మన ముందుకు రాబోతున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు యొక్క అనేక సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన కృష్ణమాధవ్ ‘హృదయం ఎక్కడున్నది’ అనే ఒక రొమాంటిక్ చిత్రం ద్వారా హీరోగా వస్తుంటే, హరి కృష్ణ మనుమడు మాస్టర్ యన్టీఆర్ (జానకిరాం కుమారుడు) ‘స్కేటింగ్ మాస్టర్’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.
కాంగ్రెస్ నాయకురాలు మరియు మంత్రి గల్లా అరుణా కుమారికి కృష్ణ మాధవ్ మేనల్లుడు. ఇతను, మొదటి నుంచి సినిమాలపై ఆసక్తి కనబరచడంతో అమెరికాలో నటన, డ్యాన్స్, ఫైట్స్ మొదలయిన వివిధ అంశాలలో శిక్షణ కూడా పూర్తిచేసుకొన్నాడు. ఈ సినిమాకు వీ. ఆనంద్ దర్శకుడు, సంజయ్ మరియు పవన్ నిర్మాతలు. కన్నడ నటిమణులు అనుష మరియు సంస్కృతి షినోయ్ ఈ సినిమాలో కృష్ణ మాధవ్ తో హీరోయిన్లుగా కలిసి నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియజేయబడుతాయి.
ఇక మాస్టర్ యన్టీఆర్ నటించిన ‘స్కేటింగ్ మాస్టర్’ సినిమా పేరుకు తగ్గట్టుగానే స్కేటింగ్ నేపద్యంలో ఉంటుంది. ఇటీవల విడుదలయిన ‘గుండెల్లో గోదారి’ సినిమా హీరో ‘ఆది’ ఈ సినిమాలో నటించడమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగు పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో వర్ధమాన నటులు బల్లెం శ్రీవెంకట్, రెహమాన్, స్నేహిక తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కెమెరా: గోపి ; సంగీతం: శ్రీ వెంకట్.